తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల: వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్ల వెలుపల క్యూ లైన్లు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించాయి. మధ్యాహ్నం తరువాత ఉన్నట్లుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయినా భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామిని దర్శించుకునేందుకు వేచి ఉన్నారు.
తర్వాత వారిని క్యూకాంప్లెక్స్‌లోనికి అధికారులు రప్పించారు. ఆలయం ముందున్న భక్తులు రేకుల షెడ్లలో తలదాచుకున్నారు. ఇక తిరుమలలో భక్తులు గదులకోసం ఇబ్బంది పడాల్సివచ్చింది. తలనీలాలు సమర్పించేందుకు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. విపరీత రద్దీ కారణంగా వాహనాలను నిలిపేందుకు కూడా స్థలం లేక రహదారుల్లోనే నిలిపివేస్తుండడం భక్తులకు ఇబ్బందిగా మారింది. అధిక రద్దీ నెలకొనడంతో ఆదివారం కూడా సెల్లార్ టికెట్లను పూర్తిగా రద్దు చేసి సామాన్య భక్తులకే ప్రాధాన్యమిచ్చారు. క్యూలైన్ లోని భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారాలు అందజేస్తున్నారు.












Click it and Unblock the Notifications