సిటీలో మరో ముగ్గురికి స్వైన్ ఫ్లూ
హైదరాబాద్: హైదరాబాదులో మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు బయట పడ్డాయి. హైదరాబాద్ లోని స్వైన్ ఫ్లూ నోడల్ సెంటర్ లో శుక్రవారం ముగ్గురు బాధితులు చేరారు. వీరిలో 35 ఏళ్ల వ్యక్తి బ్రెజిల్ లోని సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మే 30న ఆయన హైదరాబాద్ వచ్చారు. దగ్గు, జ్వరం, జలుబు తీవ్రం కావడంతో స్వచ్ఛందంగా ఛాతీ వైద్యశాలను సంప్రదించారు. కెనడాలో పనిచేస్తున్న మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మే 31న హైదరాబాద్ వచ్చారు. కొద్ది రోజులకు గొంతునొప్పి, ముక్కులోంచి నీరు రావడంతో ఛాతీ వైద్యశాలకు వచ్చారు. న్యూమెక్సికో నుంచి మే 31న నగరానికి వచ్చిన ఓ విద్యార్థి(23) తీవ్రజ్వరం, జలుబుతో బాధపడటంతో బంధువులు ఛాతీ వైద్యశాలకు తరలించారు. ఈ ముగ్గురి నుంచి సేకరించిన నమూనాలను ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల పరీక్షా కేంద్రానికి పంపారు. నివేదిక రావాల్సి ఉందని డాక్టర్ శుభాకర్ తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద ఏడుగురు స్వైన్ ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఛాతీ వైద్యశాలలో చేరిన వారిలో ఎక్కువమంది బ్రిటీష్ ఎయిర్ వేస్ లో వచ్చినవారే కావటం గమనార్హం.రెండు రోజుల వ్యవధిలో ఆ విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో 50శాతం మంది రంగారెడ్డి, హైదరాబాద్‌జిల్లాలకు చెందినవారే ఉన్నారు. వీటిలో ప్రయాణించిన 11మంది ఛాతీవైద్యశాలలో చేరారు. ఇద్దరికి హెచ్1 ఎన్1 వైరస్ ఉన్నట్టు నిర్ధరణ అయింది. మెక్సికో, కెనడా, టొరంటోలో స్వైన్‌ఫ్లూ వైరస్ ఉన్నందున అక్కడినుంచి వచ్చే వారికి ఇది సోకే అవకాశం ఉందని డాక్టర్ శుభాకర్ వివరించారు. మనదేశ వాతావరణ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మరోవైపు మే 30, 31వ తేదీల్లో బ్రిటీష్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియా విమానంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఛాతీవ్యాధుల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని వైద్యఆరోగ్యశాఖ సంచాలకులు సూచించారు.
న్యూయార్కు నుంచి మే 24న స్వైన్‌ఫ్లూ లక్షణాలతో నగరానికి వచ్చిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను శుక్రవారం అపోలో ఆస్పత్రి నుంచి ఛాతీవ్యాధుల ఆస్పత్రికి తరలించారు. ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ఢిల్లీకి పంపించారు. విదేశాల నుంచి వచ్చి కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన రోగుల్లో గొంతునొప్పి, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే తెలపాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధికి అత్యుత్తమ విధానాల్లో చికిత్స చేసే సదుపాయాలు ఛాతీవ్యాధుల ఆస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉన్నందున విధిగా అక్కడ చికిత్స తీసుకోవాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications