ఫ్లోరిడా: ఫ్లోరిడాలోని తంపా ప్రవాసాంధ్రులు సంగీత దర్శకుడు చక్రి, నాటితరం నటీమణి రోజారమణిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దాదాపు 300 మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. 2001లో బాచీ సినిమాతో మొదలుకొని 75కు పైగా మ్యూజికల్ హిట్స్ అందించిన చక్రిని ఎక్స్ లెన్స్ అవార్డుతోనూ, బాలనటిగా భక్తప్రహ్లాద చిత్రంతో తెరంగేట్రం చేసిన రోజారమణిని అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించినవేడుక కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీధర్ వల్లంపట్ల, చందు తల్ల విశేషంగా కృషి చేశారు. చందు తల్ల వ్యాఖ్యానం కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. డాక్టర్ రావ్ కొర్రబట్టిన, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, టిఎఎఫ్ టి అధ్యక్షుడు వీరారెడ్డి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక గాయనీ గాయకులు చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలు పాడి ఆహూతులను ఆనంద పారవశ్యులను చేశారు. అశోక మండ, ప్రశాంత్ పిన్నమనేని, నరేంద్ర కొమ్మ, శ్యామ్ నాదెళ్ళ అతిథులకు అభినందనలు తెలిపారు. తమ గానమాధ్యుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సందీప్ పుది, సుధ లక్కినికి, సిధా రెడ్డి, దీప్తి గ్రాండె, శశి విట్టలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.