కెసిఆర్ మాకు దొరకలేదు: చంద్రశేఖర్
హైదరాబాద్: ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై సమీక్ష జరిపించాలని అడగడానికి తాము తమ నేత కె.చంద్రశేఖరరావు కోసం వెతికామని, కెసిఆర్ పది పదిహేను రోజుల పాటు దొరకలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బహిష్కృత నేత ఎ.చంద్రశేఖర్ అన్నారు. తెరాస అసమ్మతి నేతలు తమ తదుపరి కార్యక్రమాన్ని ఖరారు చేసుకోవడానికి శనివారం చంద్రశేఖర్ నివాసంలో సమావేశమయ్యారు. తమ సహచరుడు రవీంద్రనాయక్ బహిరంగ లేఖ రాసిన తర్వాతనే కెసిఆర్ బయటకు వచ్చారని చంద్రశేఖర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తాను పార్టీ అధ్యక్ష పదవికి చేసిన నిజమైందేనని, తాను వెనక్కి తగ్గనని కెసిఆర్ చెప్పాలని, అలా చెప్తే కెసిఆర్ మద్దతుదారులు పెదవులు విప్పబోరని, అప్పుడు కెసిఆర్ నిజంగానే రాజీనామా చేసినట్లు భావిస్తామని ఆయన అన్నారు. కెసిఆర్ రాజీనామా ఉత్తుత్తదేనని, తనకు అనుకూలమైనవారితో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకుని చప్పట్లు కొట్టించుకుని మళ్లీ అధ్యక్ష పీఠంపై కెసిఆర్ కూర్చుంటారని ఆయన అన్నారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే సర్వసభ్య సమావేశం కీలకమేమీ కాదని ఆయన అన్నారు.
కెసిఆర్ రాజీనామాను ఆమోదించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే సరిపోదని, తమ సహచరుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వేసిన పదిహేను ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని, ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరపాల్సి ఉంటుందని, అప్పుడు తాము వారితో కలిసి పనిచేయడానికి వీలవుతుందని చంద్రశేఖర్ అన్నారు.












Click it and Unblock the Notifications