మేడమ్ తో చెప్పా: వైయస్

వైఎస్ శుక్రవారం ఉదయాన్నే కేంద్ర న్యాయమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ నివాసానికి వెళ్లారు. ఆయనతో కలిసి అల్పాహారం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల మేరకు దళిత క్రైస్తవులకు ఎస్సీలహోదా కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ చర్చిల సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి, ఎస్సీ కమిషన్‌కు లేఖ రాసిన సంగతి వైఎస్ వీరప్ప మొయిలీ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి వచ్చిన దళిత క్రైస్తవులు మొయిలీకి వినతి పత్రం సమర్పించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీల వర్గీకరణను కూడా త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర న్యాయమంత్రిని కోరారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన చర్యలు తీసుకొనేట్లు సామాజిక న్యాయ శాఖ మంత్రిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం సామాజిక న్యాయ మంత్రి ముకుల్ వాస్నిక్‌తో సమావేశం అయ్యారు. వర్గీకరణ, దళిత క్రైస్తవుల సమస్యలను వివరించారు.
శుక్రవారం ఆయన భారీ పరిశ్రమల మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్, జల వనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్, పర్యటక, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రి కుమారి షైల్జా, ఉపరితల రవాణా మంత్రి కమల్‌నాథ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ మీనాలతో భేటీ అయ్యారు.
బలహీన వర్గాల ఇళ్లకు రూ.20 వేల వరకు రుణం ఇచ్చే అవకాశాలను, డ్వాక్రా మహిళలకు సరళ నిబంధనలతో రుణాలను ఇచ్చే అవకాశాలను ఆర్థిక శాఖ సహాయ మంత్రితో చర్చించారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు వివిధ బ్యాంకుల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు రుణాలను ఇచ్చే అవకాశాలను మంత్రితో చర్చించినట్లు ముఖ్యమంత్రి విలేకరులకు చెప్పారు. ఇప్పటికే తొమ్మిది బ్యాంకుల నుంచి రూ.2,530 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరయ్యాయని, మరో వెయ్యి కోట్లకు కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంకుల నుంచి రుణాల మంజూరు కోసం ప్రయత్నం జరుగుతోందని వివరించారు.
విలాసరావు దేశ్‌ముఖ్ దగ్గర శ్రీకాళహస్తి ఎలక్ట్రికల్ పరికరాల ప్రాజెక్టు శంకుస్థాపన గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌లో ఖాయిలా పడిన హిందుస్థాన్ కేబుల్స్ సంస్థను పునరుద్ధరించే అవకాశాలను చర్చించారు. విశాఖకు చెందిన భారత్ హెవీ వెసల్స్ అండ్ ప్లేట్స్ సమస్యను ప్రస్తావించారు. రాజస్థాన్ కూడా పోటీలో ఉన్నందున సాంకేతికంగా ఎక్కడ లాభదాయకమో నిర్ధారించేందుకు కమిటీని రెండు రాష్ట్రాలకు పంపిస్తామని విలాసరావు విలేకరులకు చెప్పారు. కమిటీ నివేదిక అందాకే తుది నిర్ణయంతీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రిని ఇదే విషయం అడగ్గా, ''మీరేమీ ఆందోళన చెందొద్దు. ప్రాజెక్టు మనకే వస్తుంది'' అన్నారు. షైల్జాతో సమావేశమైనపుడు ముఖ్యమంత్రి నిరుపేదల ఇళ్లకు మరింత కేంద్ర సాయం కావాలని కోరారు.
పోలవరం సహా రాష్ట్రానికి చెందిన ఆరు భారీ సాగునీటి ప్రాజెక్టులను జాతీయప్రాజెక్టులుగా పరిగణించాలని పవన్ కుమార్ బన్సల్‌ను వైఎస్ కోరారు. వంశధార నదికి ట్రైబ్యునల్ వేయాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టుల సాంకేతిక అనుమతులు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న సంగతి గుర్తు చేశారు. గోదావరిపై బాబ్లీ, మరో 11 ప్రాజెక్టుల నిర్మాణం అక్రమంగా సాగుతున్న విషయం ముఖ్యమంత్రి కేంద్ర జల వనరుల మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అయిదు ప్రధాన రహదారులను 1500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుగా గుర్తించి, అభివృద్ధి చేయాలని వైఎస్ కేంద్ర ఉపరితల రవాణా మంత్రి కమల్‌నాథ్‌ను కోరారు. గోదావరిపై ఏటూరు నాగారం దగ్గర వంతెన నిర్మించి హైదరాబాద్-భూపాలపట్నం రహదారిని 202 జాతీయ రహదారితో కలపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్- సంగారెడ్డి-జహీరాబాద్ ఎన్‌హెచ్-9 విస్తరణ పూర్తి చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications