మావోయిస్టులు ఇక ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ మేరకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం-1967 కింద సోమవారంనాడు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంస్థపై నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. 2004లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసీసీ) విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన మావోయిస్టులపై నిషేధం ఉందా? లేదా? అనే సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో దీనికి తెరదించుతూ నోటిఫికేషన్ జారీచేశామని హోంశాఖ మంత్రి చిదంబరం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే పీపుల్స్‌వార్, ఎంసీసీలపై నిషేధం ఉందని ఆయన చెప్పారు.
'ఈ రోజు మేం చేసిందిల్లా సందిగ్ధతను తొలగించడమే. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టంలోని షెడ్యూలులో సీపీఐ (మావోయిస్టు) అనే పదం చేర్చాం. దీంతో నిషేధంపై ఉన్న సందిగ్ధం తొలగిపోయింది' అని ఆయన వివరించారు. 'రెండు రోజుల క్రితం నేను మావోయిస్టుల విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు నిషేధిత జాబితాలో సీపీఐ (మావోయిస్టు) అనే పదం లేదని నా దృష్టికి వచ్చింది. దీంతో చట్టంలో సందిగ్ధతను తొలగించాలని నిర్ణయించాం' అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు మావోయిస్టు సంస్థలను చట్ట వ్యతిరేక సంస్థలుగా గుర్తించి నిషేధించాయని, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద నిషేధించాయని చిదంబరం వెల్లడించారు.












Click it and Unblock the Notifications