టిడిపి బాబుది కాదు: నల్లపురెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబునాయుడిది కాదని, తనను సస్పెండ్ చేసే అధికారం చంద్రబాబుకు లేదని నెల్లూరు జిల్లా కొవ్వూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఆయన గురువారం రెండో లేఖ సంధించారు. ఏనాటికైనా తెలుగుదేశం పార్టీని నందమూరి వారసులకు అప్పగించాలని ఆయన అన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసం లేదని ఆయన అన్నారు. బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగు యువత అధ్యక్షుడిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబును, పార్టీని ఐదుగురు దుష్టశక్తులు నాశనం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నామా నాగేశ్వరరావు, సిఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ రావు, సుజన చౌదరి, కోనేరు ప్రసాద్ చంద్రబాబును, పార్టీని భ్రష్టు పట్టించారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ఐదుగురు పారిశ్రామికవేత్తల చేతుల్లో కీలుబొమ్మ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు క్రమశిక్షణ గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.
చంద్రబాబు ఒంటెత్తు పోకడలు మానలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే తన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. నాగం జనార్దన్ రెడ్డి ఒక బఫూన్ అని, తన గురించి మాట్లాడే నైతిక హక్కు జనార్దన్ రెడ్డికి లేదని ఆయన అన్నారు. ఏం చేద్దామని తెలుగుదేశం పార్టీలో చేరావని ఆయన మైసురా రెడ్డిని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications