డిఎస్ ఎదుటే వర్గాల బాహాబాహీ
విజయవాడ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమక్షంలోనే కృష్ణా జిల్లాలోని కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. కృష్ణా జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) సమావేశం సందర్భంగా శుక్రవారం ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సమావేశం లోపల ఒక ఘర్షణ, వెలుపల మరో ఘర్షణ జరిగాయి. సమావేశం లోపల జగ్గయ్యపేట శాసనసభా నియోజకవర్గానికి చెందిన రేపాల మోహన్ రావు, ఉదయభాను వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. జగ్గయ్యపేటలో రేపాల మోహన్ రావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్లనే ఉదయభాను ఓడిపోయారని ఒక వర్గం వాదించింది. రేపాల మోహన్ రావుకు వ్యతిరేకంగా ఉదయభాను వర్గం కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
సమావేశం వెలుపల నూజివీడు నియోజకవర్గానికి చెందిన మేకల ప్రకాశరావు, పాలడుగు వెంకటరావు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులకు కూడా దిగారు. తమను సమావేశం లోపలికి అనుమతించాలని పాలడుగు వెంకటరావు వర్గం పట్టుబడుతూ ధర్నాకు దిగింది. దీంతో డి శ్రీనివాస్ వెలుపలకి వచ్చి ప్రకటన చేశారు. అయినా వారు వినలేదు. దీంతో ఆయన లోనికి వెళ్లిపోయి సమావేశం పూర్తయిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా పాలడుగు వెంకటరావు వర్గం బందరు రోడ్డులో బైఠాయించి ఆందోళన సాగించారు.












Click it and Unblock the Notifications