అసెంబ్లీ: సింగూరు నీటిపై రభస

తెలుగుదేశం, తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. సభ సజావుగా జరగడానికి సహకరించాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే సూచించారు. ఆ సూచనలను వారు పట్టించుకోలేదు. ఇలాగైతే సభను నడిపించడం సాధ్యం కాదని, తాను సభను వాయిదా వేస్తానని స్పీకర్ చెప్పారు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై గొడవ చేయడం సరి కాదని ఆయన చెప్పారు. అయినా సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ్యులు స్పీకర్ వెల్ లోకి చేరుకుని సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. తాము సింగూరు నుంచి హైదరాబాదు సికింద్రాబాద్ జంటనగరాలకు సింగూరు నుంచి జలాలను తరలించడానికి కొత్తగా పైపులైన్లు వేయలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద భూములకు తగిన విధంగా నీరందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో సభ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications