ఒకే ఒక్కడు వైయస్

అయితే, నమ్మినవారికి ప్రాణం ఇస్తారనే విశ్వాసాన్ని ఆయన పదవిలో ఉన్నాలేకున్నా అనిపించుకున్నారు. తన వెంట ఉన్నవారికి అవకాశాలు కల్పించడంలో ఆయన ఎనాడూ వెనకాడలేదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాంగ్రెసు పార్టీకి జవజీవాలు పోసే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు అనుచర గణం ఉండడం ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వామపక్షాలతో కలిసి యుద్ధభేరీ మోగించాడు. కాంగ్రెసుకు అప్పటి వరకు లేని మిలిటెన్సీని అందించారు. విద్యుత్ పోరాటంలో ఆయన చూపిన తెగువ మరిచిపోలేనిది.
2004 ఎన్నికల్లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమన్వయం చేసుకుంటూ తనదే పైచేయి అనిపించుకోవడానికి అహర్నిశలు కృషించారు. ఆయన చేసిన సుదీర్ష పాదయాత్ర ఆయనను కాంగ్రెసులో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తును ఆయన వ్యతిరేకించారు. అయితే పార్టీ అధిష్ఠానవర్గం అభిప్రాయానికి తలొగ్గి తెరాసతో పొత్తుకు అంగీకరించారు. వామపక్షాలు, తెరాసతో కలిసి కాంగ్రెసు పోటీ చేసి ఘన విజయం సాధించింది. కాంగ్రెసు ఒక్కటే 185 స్థానాలను గెలుచుకుంది. దాంతో ఏ మాత్రం వ్యతిరేకత లేకుండా ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
రెండోసారి 2009 ఎన్నికల్లో తన మాటనే పార్టీ అధిష్ఠానవర్గం వద్ద గెలిపించుకున్నారు. తెరాస, వామపక్షాలు లేకున్నా పార్టీని విజయపథాన నడిపిస్తానని పార్టీ అధిష్ఠానవర్గానికి హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలను ఆయనే ఒంటరిగా ఒక్కరే భుజాన వేసుకున్నారు. ఎన్నికల బాధ్యతను ఆయనే పూర్తిగా తీసుకున్నారు. దీంతో కాంగ్రెసు పార్టీలో ఒకే ఒక్కడు అనే పేరు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మరింతగా ఆయన బలపడ్డారు. పూర్తిగా తన వ్యతిరేకులను పక్కన పెట్టి తన అనుచరవర్గానికే రాష్ట్ర మంత్రివ్రర్గంలో పెద్ద పీట వేశారు. జానారెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వంటి సీనియర్లను కూడా పక్కన పెట్టారు. ఎన్నికల కమీషన్ శరాఘాతంతో పక్కకు తప్పుకోవాల్సి వచ్చిన డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ ను తిరిగి అధికారంలోకి వచ్చిన మరు క్షణమే ఆ బాధ్యతలను మళ్లీ కట్టబెట్టారు. తనకు అత్యంత సన్నిహితులైన కెవిపి రామచందర్ రావు, సూరీడు వంటి వారికి ప్రధాన బాధ్యతలు ఇవ్వడంలో ఎవరి మాటలకు కూడా వెనకాడలేదు.
అధికారంలో ఉంటూ కూడా బెదరకపోవడం, ఇరకాటంలో పడకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్క రాజశేఖర రెడ్డిని మాత్రమే చూస్తాం. తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, వామపక్షాలపై, తెరాసపై ఎదురు దాడి చేస్తూ అధికార రాజకీయాలకు కొత్త అర్థం ఇచ్చారు. ఈ రకంగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ధీశాలిగా, సాహసవంతుడిగా పేరు పొందారు.












Click it and Unblock the Notifications