హైదరాబాద్: విద్యార్థులు తలపెట్టిన శాంతి యాత్ర సందర్భంగా మావోయిస్టుల కదలికలను గమనిస్తున్నట్లు విజిలెన్స్ ఐజి అనురాధ చెప్పారు. విద్యార్థులు 10వ తేదీన చేపట్టిన ర్యాలీ సందర్బంగా భద్రతా చర్యలకు అనురాధ నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2200 మందిని ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. హైదరాబాదులో 169 మందిని అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు. విద్యార్థులు ర్యాలీకి అనుమతి లేదని ఆమె చెప్పారు. ఎవరు కూడా జిల్లాల నుంచి హైదరాబాద్ రావద్దని ఆమె సూచించారు. పిల్లలను తల్లిదండ్రులు హైదరాబాద్ కు పంపవద్దని సూచించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి ఇతర వ్యక్తులు వచ్చారని ఆమె చెప్పారు. ఇతరులు రాకుండా తాము నిరోధిస్తున్నామని ఆమె చెప్పారు. ఆమె ఈ సందర్భంగా రత్నమాల, విమల పేర్లను ప్రస్తావించారు. ఈ స్థితిలో ఇతర శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించాయని తమకు కచ్చితమైన సమాచారం ఉందని ఆమె అన్నారు. అందుకే భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. కాగా, విద్యాసంస్థల మూసివేతను సమర్థిస్తూ హాస్టళ్లను తెరవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలను, హాస్టళ్లను మూసివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేసింది.