తృణమూల్ కు వచ్చే సీట్లు ఎన్నో వెల్లడించిన మమత బెనర్జీ
ఇంకొక్క రోజే మిగిలివుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ.. కోల్ కతలో పార్టీ నాయకులతో వర్చువల్ గా సమావేశం అయ్యారు. పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా పలువురు సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తిప్పి కొట్టారు. స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసే ప్రయత్నంగా కొట్టిపడేశారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని మమత బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.

2021 నాటి ఫలితాలు పునరావృతమౌతాయని తేల్చి చెప్పారు. అప్పుడు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయని గుర్తు చేశారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంటుందని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు చేసిన అవిశ్రాంత పోరాటానికి అభినందనలు తెలిపారు. తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. తాము విజయం సాధించబోతోన్నామని, 200లకు పైగా సీట్ల లభిస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని అన్నారు.
స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేయడానికి ఎగ్జిట్ పోల్స్‌ను ఓ టూల్ గా కేంద్రం ఉపయోగించుకుంటోందని మమత బెనర్జీ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసే ప్రయత్నం కోసమే తప్ప మరొకటి కాదని, 2021 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ఇవే జిమ్మిక్కులు చేశారని, ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలకే తెర తీశారని ఆమె వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు మోహరించిన తీరుపై ఈ సందర్భంగా తృణమూల్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని పార్టీ కార్యకర్తలపై జరిగిన క్రూర చర్యగా మమత అభివర్ణించారు. ఓటర్లను.. ముఖ్యంగా మహిళలను భయపెట్టడానికి కేంద్ర బలగాలను బీజేపీ ప్రయోగించిందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ప్రతి గ్రామానికి, ప్రతి వీధికీ వెళ్లి మహిళలను కొట్టారని, పిల్లలను కూడా వదిలిపెట్టలేదని, మీడియాలోని ఒక వర్గం వారికి సహకరించిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications