టీ20 వరల్డ్ కప్ కోసం మన శ్రీచరణికి బంపర్ ఆఫర్
మహిళల టీ ప్రపంచ కప్, ఇంగ్లాండ్ సిరీస్ కోసం భారత జట్టును ఖరారైంది. కొద్దిసేపటి కిందటే బీసీసీఐ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టు ఇది. యాస్తికా భాటియా, రాధా యాదవ్ జట్టులోకి తిరిగొచ్చారు. గాయాల బారిన పడ్డ కాష్వీ గౌతమ్, అమన్‌జోత్ కౌర్‌లకు చోటు దక్కలేదు. వారు ఇంకా రికవరీ కావాల్సి ఉంది. ప్రస్తుతం బీసీసీఐ రిహాబిలిటేషన్ లో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ ఆరంభం అయ్యే నాటికి కోలుకునే అవకాశం లేకపోవడంతో వారి పేర్లను పరిశీలనలోకి తీసుకోలేదు సెలెక్టర్లు.
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ మధ్యాహ్నం సమావేశమైంది. ఇందులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హెడ్ కోచ్ అమోల్ మజుందార్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అమితా శర్మ, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా పాల్గొన్నారు. అనంతరం జట్టును ప్రకటించారు. యాస్తికా భాటియా మోకాలి గాయంతో గత ఏడాది మహిళల ఐసీసీ వరల్డ్ కప్, ఈ సంవత్సరం విమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లకు దూరం అయ్యారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గాయపడిన ఆమె, విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు జట్టులోకి తిరిగి వచ్చారు.

రాధా యాదవ్ దాదాపు ఏడాది తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. గత ఇంగ్లాండ్ పర్యటనలో చివరిసారిగా మ్యాచ్ లు ఆడారామె. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా ఏ జట్టును విజయవంతంగా నడిపించారు. కాష్వీ గౌతమ్, అమన్‌జోత్ కౌర్ గాయాలతో తప్పుకోవడంతో, ఫాస్ట్ బౌలర్ నందిని శర్మకు భారత జట్టులో తొలిసారిగా చోటు దక్కింది. ఈ ఏడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌పై నందిని నాలుగు ఓవర్లల్లో 33 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు కూల్చారు. సీజన్ మొత్తం మీద 10 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టారు. 8.31 ఎకానమీ రేటును నమోదు చేశారు. దీంతో ఆమెకు టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం లభించింది. శ్రీలంక సిరీస్‌తో అరంగేట్రం చేసిన కమలిని, వైష్ణవిలను కూడా పక్కనపెట్టారు. వైష్ణవి ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ, ఆడే అవకాశం లభించలేదు.
భారత స్పిన్ దళం దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్‌లతో పటిష్టంగా ఉంది. షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పార్ట్‌టైమ్ స్పిన్ ఎంపికలుగా ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఓపెనర్‌గా అనుష్క శర్మ అద్భుతమైన స్ట్రోక్ ప్లే రాణించిన నేపథ్యంలో ఆమెను కొనసాగించారు. కాష్వీ గౌతమ్ కుడి మోకాలి గాయం కారణంగా ప్రపంచ కప్‌కు దూరమైందని సెలక్టర్ అమితా శర్మ తెలిపారు. అమన్‌జోత్ కౌర్ దక్షిణాఫ్రికా పర్యటన నుండి గాయం కారణంగా తప్పుకొన్నారు.
మహిళల టీ20 వరల్డ్ కప్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కోసం భారత జట్టులో.. హర్మన్‌ప్రీత్ కౌర్ (కేప్టెన్), స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, యాస్టికా భాటియా, నందిని శర్మ, క్రాంతి గౌడ్, రాధా యాదవ్, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, అనుష్క శర్మ, దీప్తి శర్మ ఉన్నారు.
ఇంగ్లాండ్‌తో లార్డ్స్ టెస్ట్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కేప్టెన్), స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, శ్రీ చరణి, యాస్టికా భాటియా, నందిని శర్మ, హర్లీన్ డియోల్, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, స్నేహ్ రాహా ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications