మా రాజీనామాలు తమాషా కాదు: జెసి

తాము సీరియస్ గానే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షలు కూడా చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లాగా అల్లరి చేసేలా వ్యవహరించబోమని, భయాందోళనలను ప్రేరేపించబోమని ఆయన చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేసినట్లు తెలుస్తోందని, దాన్ని తాము ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాల నుంచి పోలీసులను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అధిష్టానం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెసు శాసనసభ్యుడు వైయస్ వివేకానంద రెడ్డి హెచ్చరించారు. అయితే అందుకు ఆయనను సహచరులు వారించారు. తెలంగాణ మంత్రుల మాదిరిగా తాము ఐక్యంగా వ్యవహరించబోమా అని కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు మథనపడ్డారు. తమ ప్రాంతానికి చెందిన కొందరు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని, వారంతా పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి ముందుకు రావాలని వారన్నారు.