వరంగల్: సామాజిక తెలంగాణ లక్ష్యమంటూ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రకటిస్తూ వచ్చిన పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ఒక్కసారిగా 'మెగా' టర్న్ తీసుకుని సమైక్యాంధ్ర బాట పట్టడంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధినేత నిర్ణయంపై ఆగ్రహావేశాలు వెల్లగక్కారు. జిల్లాకు చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండల స్థాయిలో నాయకులు, కార్యకర్తల రాజీనామాల పర్వం కొనసాగడంతో పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యింది. జిల్లాలో ప్రస్తుతం పీఆర్పీ అడ్రస్ గల్లంతైనట్లే. చిరంజీవి నిర్ణయంపై ఆగ్రహంతో వరంగల్ చౌరస్తా, పోచమ్మమైదాన్‌తో పాటు అనేక సెంటర్లలో పీఆర్పీ జెండాలను నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ దహనం చేశారు.
జిల్లా పార్టీ కార్యాలయాన్ని మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జెండా గద్దెలను ధ్వంసం చేశారు. కురవిలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమైన పలువురు జిల్లా నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు, భవి ష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వామ్యం కావాలని తీర్మానించారు. నూతనంగా ఏర్పాటు చేసే తెలంగాణ ఉద్యమ పార్టీ ద్వారా పోరాటం చేయాలని నిర్ణయించారు. అభిమాన సంఘాల నేతలు కూడా సంఘాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి