హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తాజా ప్రకటనకు నిరసనగా తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేశారు. గురువారం రాత్రి వారు తమ రాజీనామా లేఖలను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. తెలంగాణకు సంబంధించిన ప్రకటనలో స్పష్టత లేదని, ఆ ప్రకటనలో అయోమయం నెలకొందని, మీరు జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని, లేదంటే రాజీనామాలు ఆమోదించాలని వారు సోనియాను కోరారు. మంత్రి డికె అరుణ నివాసంలో గురువారం రాత్రి సమావేశమై తెలంగాణ మంత్రులు వారు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతకు ముందే ఐటి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాజీనామా చేశారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య, ముఖేష్ గౌడ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. పొన్నాల లక్ష్మయ్య మాత్రం హైదరాబాదులో లేరని తెలుస్తోంది.
కాగా, రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి వారికి సూచించారు. రాజీనామాలు చేయడానికి ముందు వారు ముఖ్యమంత్రిని కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అయితే వారు ముఖ్యమంత్రి సలహాను వినలేదు. శుక్రవారం ఉదయం పది గంటలకు వారు మరోసారి ముఖ్యమంత్రి రోశయ్యను కలవనున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మధు యాష్కీ తాము లాబీయింగ్ చేయదలుచుకులేదని, పోరాటం ద్వారానే తెలంగాణ సాధించుకుంటామని అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి