మావోయిస్టు లింక్: 60 లక్షల నగదు స్వాధీనం

ఉత్తర తెలంగాణలోని మావోయిస్టు అగ్రనేతలు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కొద్దిరోజుల కిందట తమ కొరియర్లను అడవిలోకి పిలుచుకున్నారు. ఇందులో భాగంగా ఏటూరునాగారం మండలం లక్ష్మీపురం గ్రామస్థుడు వెలగందుల వీరయ్య, మంగపేట మండల కేంద్రం నివాసి సిద్ధంశెట్టి వైకుంఠాన్ని హన్మకొండలోని సివిల్ కాంట్రాక్టర్ కేతిరి సుదర్శన్‌రెడ్డి వద్దకు పంపారు. మావోయిస్టు అగ్రనేతల ఆదేశాల మేరకు కొరియర్లు సుదర్శన్‌రెడ్డిని కలిశారు. ఆయన ఈనెల 21న రూ.50 లక్షలు, 23న రూ.10 లక్షలు అప్పగించారు. వాటిని మావోయిస్టు అగ్రనేతలకు ఇవ్వటానికి శుక్రవారం గంగుగూడెం గ్రామానికి చేరుకున్నారు. మావోయిస్టులు కూడా అక్కడికి వచ్చారు. అప్పటికే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రావడంతో మావోయిస్టులు తప్పించుకునిపోగా కొరియర్లు ఇద్దరు దొరికిపోయారు. వారి నుంచి రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన కొరియర్లను శనివారం కోర్టులో హాజరుపరిచారు. కాంట్రాక్టర్ సుదర్శన్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని ఎస్పీ షానవాజ్ ఖాసిం చెప్పారు. కాంట్రాక్టర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. అరెస్టయిన ఇద్దరు కొరియర్లలో వైకుంఠం కూడా ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతే. మావోయిస్టులు చేపట్టిన డబ్బు వసూళ్లలో ఇద్దరు కాంగ్రెస్ నేతల పాత్ర ఉండటం సంచలనం కలిగించింది.












Click it and Unblock the Notifications