హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉస్మానియా విద్యార్థులు జెఎసి నిర్వహించిన మహా గర్జన విజయం సాధించింది. లక్షలాది మంది విద్యార్థులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణ పోటెత్తింది.తెలంగాణ నినాదాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం హోరెత్తింది. కొన్ని షరతులతో హైకోర్టు విద్యార్థి గర్జనకు అనుమతిచ్చింది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు గానీ కార్యకర్తలుగానీ హాజరు కాలేదు. తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన విద్యార్థులు మాత్రమే సభకు హాజరయ్యారు. ప్రజా సంఘాల నాయకులను తొలుత పోలీసులు అనుమతించలేదు. అయితే వారిలో కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. మందకృష్ణ మాదిగ, వరవరరావు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్, బెల్లయ్య నాయక్ మాత్రమే హాజరయ్యారు. విద్యార్థులే తెలంగాణ ఉద్యమానికి ఎజెండా ఖరారు చేశారు.
తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ నెల 5వ తేదీననే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీల కార్యాలయాలు కూల్చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. చర్చలు అక్కర్లేదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు. గుజ్జర్ల తరహా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 5వ తేదీన రైలు రోకోకు, రాస్తా రోకోకు పిలుపునిచ్చారు. కోస్తాంధ్ర, రాయలసీమల నుంచి వచ్చే వాహనాలను, రైళ్లను అడ్డుకోవాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించకపోతే సంక్రాంతికి వెళ్లిన సీమాంధ్రులను తిరిగి రానివ్వబోమని హెచ్చరించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి