న్యూఢిల్లీ: తెలంగాణపై మంగళవారం రాజకీయ పార్టీలతో జరిగే హోం మంత్రిత్వ శాఖ సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలే కాకుండా ప్రజలు కూడా ఈ సమావేశం ఫలితంపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక, అనుకూల రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీలో మోహరించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 8 రాజకీయ పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధులను అహ్వానించింది. కాంగ్రెసు తరఫున కావూరి సాంబశివర రావు, ఉత్తమకుమార్ రెడ్డి, తెలుదేశం తరఫున రేవూరి ప్రకాష్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, బిజెపి తరఫున బండారు దత్తాత్రేయ, హరిబాబు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున కె. చంద్రశేఖర రావు, జయశంకర్, ప్రజారాజ్యం తరఫున చిరంజీవి, సి. రామచంద్రయ్య పాల్గొంటున్నారు. మజ్లీస్ తరఫున అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ తరఫున కె. నారాయణ, గుండా మల్లేష్, సిపిఎం తరఫున బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి పాల్గొంటున్నారు.
హోం మంత్రిత్వ శాఖ సమావేశం మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు జరుగుతుంది. అభిప్రాయ సేకరణ జరిపి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఏకాభిప్రాయ సాధన కోసం విస్తృత స్థాయి చర్చల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చిదంబరం ఇప్పటికే చెప్పారు. రాష్టానికి చెందిన రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రాంతాలవారీగా విడిపోయి తెలంగాణ అనుకూల, వ్యతిరేక విధానాలను వ్యక్తీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాల కన్నా ప్రాంతాలవారీగా రాజకీయ నాయకుల అభిప్రాయం ముఖ్యంగా మారిపోయింది.
కాగా, రాష్ట్రంలో ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు ప్రాంతాల ఆందోళనకారులు తమ తమ వైఖరులను కేంద్రానికి తెలియజేయడానికి రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్నారు. పలు రైళ్లను రాష్ట్రంలో నిలిపేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి