"దోస్తీ" కుదిరిందా ?? ఒక్కటి కానున్న OnePlus, Realme..
స్మార్ట్‌ఫోన్ రంగంలో కీలక పరిణామంగా OnePlus, Realme తమ కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా ఒక్కటి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు టెక్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. యూరప్‌లో వన్‌ప్లస్ ఉనికి తగ్గుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం మరింత చర్చకు దారితీసింది. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ.. ఈ వ్యూహాత్మక మార్పులు త్వరలో అమల్లోకి వచ్చే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏకీకరణలో భాగంగా, రెండు బ్రాండ్‌లు కలిసి ఒక కొత్త గ్లోబల్ ప్రొడక్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయని సమాచారం. ఈ కేంద్రం ప్రొడక్ట్ ప్లానింగ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, గ్లోబల్ ఆపరేషన్స్ వంటి కీలక విభాగాలను సమన్వయం చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా Pete Lau నాయకత్వంలో ఈ మార్పులు అమలు కావచ్చని సమాచారం. ఇప్పటికే ఆయన OPPOలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మూడు బ్రాండ్‌ల మధ్య సమన్వయం మరింత పెరగనుంది.

కాగా BBK Electronics గ్రూప్‌కు చెందిన వన్‌ప్లస్, రియల్‌మీ, ఓప్పో బ్రాండ్‌ల మధ్య ఈ సమీకరణ ప్రధానంగా ఖర్చులను తగ్గించడం, R&D (రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) సామర్థ్యాలను పంచుకోవడం, ఉత్పత్తుల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా జరుగుతోంది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై డిజైన్‌లు, సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, హార్డ్‌వేర్ భాగాలను పునర్వినియోగం చేయడం ద్వారా తయారీ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్పుల వల్ల బ్రాండ్ ఐడెంటిటీపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వన్‌ప్లస్ తన ప్రత్యేకమైన 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్' ఇమేజ్‌తో వినియోగదారుల మనసు గెలుచుకుంది.
కానీ భవిష్యత్తులో వన్‌ప్లస్ ఫోన్లు రియల్‌మీ లేదా ఓప్పో డివైస్‌లకు దగ్గరగా కనిపించే అవకాశముందని టెక్ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఒకవైపు తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించే అవకాశాన్ని పెంచినా, మరోవైపు బ్రాండ్ ప్రత్యేకత తగ్గే ప్రమాదం ఉంది. యూరప్ మార్కెట్‌లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. ఇటీవల అక్కడ వన్‌ప్లస్ కొత్త మోడళ్ల విడుదలలు తగ్గడం, ఫ్లాగ్‌షిప్ డివైస్‌ల లభ్యత తగ్గడం వంటి అంశాలు వినియోగదారుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూరప్‌లో వన్‌ప్లస్ కార్యకలాపాలను పరిమితం చేసి, ఇతర బ్రాండ్‌ల ద్వారా మార్కెట్‌ను నిర్వహించే వ్యూహం ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే భారతదేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వన్‌ప్లస్‌కు బలమైన ఫ్యాన్‌బేస్, ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ రిటైల్ నెట్‌వర్క్ ఉన్న నేపథ్యంలో, కంపెనీ తన ఉనికిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయొచ్చు. కొత్త మోడళ్లతో పాటు, సర్వీస్ సెంటర్లు, కమ్యూనిటీ ఈవెంట్స్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను మెరుగుపరచడం ద్వారా భారత మార్కెట్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications