న్యూఢిల్లీ: రాష్ట్ర రాజకీయ పార్టీల అఖిల పక్ష సమావేశంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం తీరు పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రతినిధి యనమల రామకృష్ణుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు ఏర్పాటు చేసే వ్యవస్థను గానీ చర్చల ప్రక్రియను గానీ దేశానికంతటికీ వర్తింపజేస్తారా అని అడిగితే లేదని చిదంబరం చెప్పారని ఆయన సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమిళనాడుకు విభజన ప్రక్రియ వర్తించదని చిదంబరం చెప్పడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు చిదంబరం కంకణం కట్టుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. చిదంబరం కేవలం అందరి అభిప్రాయాలను మాత్రమే తీసుకున్నారని ఆయన అన్నారు. కేంద్రం గానీ కాంగ్రెసు పార్టీ గానీ స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
రాష్ట్ర విభజనకు నిర్దిష్ట కాలపరిమితిని పెట్టాలని తెలుగుదేశం తెలంగాణ ప్రతినిధి రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. మూడు పార్టీలు మాత్రమే స్పష్టమైన వైఖరి ప్రకటించలేదనేది నిజం కాదని ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పినట్లు ఆయన తెలిపారు. తమ నేత చంద్రబాబు శాసనసభలో చెప్పారని, అఖిల పక్ష సమావేశంలో కూడా చెప్పామని ఆయన వివరించారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పార్లమెంటులో ఎప్పుడు పెడతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి