హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వస్తే కాంగ్రెసు నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని, తమ పార్టీ నేతలు వెనకనే ఉంటారని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి నేతల రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఆయన సోమవారం మాట్లాడారు. కాంగ్రెసు నేతలు ఉద్యమానికి సహకరించాలని ఆయన కోరారు. ఉద్యమం నుంచి కాంగ్రెసు నాయకులు తప్పుకోలేరని ఆయన అన్నారు.
రాజకీయ ఒత్తిడితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని, కాంగ్రెసు నేతలు వెనక్కి తగ్గవద్దని ఆయన అన్నారు. రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి తెచ్చే విషయంపై గడువు కోరింది కాంగ్రెసు నేతలేనని, ఈ నెల 28వ తేదీని కాంగ్రెసు నేతల కోరిక మేరకే జెఎసి గడువుగా పెట్టిందని ఆయన అన్నారు. గడువు పెంచాలని జెఎసిలో ఎటువంటి ప్రతిపాదన కూడా రాలేదని ఆయన అన్నారు. రాజకీయ ఒత్తిడి లేకుండా తెలంగాణ వస్తుందనుకుంటే పొరపాటేనని, కాంగ్రెసు నాయకులు ముందుంటే తాము వెనక ఉంటామని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి