తిరుమల: తిరుమల శ్రీనివాసునికి అన్నమయ్య సంకీర్తనలను సమర్చించడానికి వచ్చిన గానకోకిల లతా మంగేష్కర్‌కు చేదు అనుభవం ఎదురయింది. శ్రీవారి పాటల సిడి ఆవిష్కరిస్తున్న సమయంలో దొంగలు తమ హస్తలాఘవం ప్రదర్శించారు. లతా మంగేష్కర్ హ్యాండ్‌బ్యాగ్‌ను చోరీ చేశారు. హ్యాండ్‌బ్యాగ్‌లో క్రెడిట్ కార్డు, విమానం టిక్కెట్టు ఉండడంతో ఆందోళన చెందిన లత, ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరవేసేందుకు ప్రయత్నించారు. అయితే అధికార యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి రాకతో హడావుడిలో ఉండడం వల్ల వారెవరూ అందుబాటులోకి రాలేదు.
ఆఖరికి కొంతమంది అధికారులు జోక్యం చేసుకుని లతకు ముంబై వెళ్ళేందుకు టిక్కెట్టు సమకూర్చారు. లతా మంగేష్కర్ రాక సందర్భంగా హడావుడి చేసిన అధికారులు గానీ, చైర్మన్ గానీ వీడ్కోలు పలకడానికి రాకపోవడంతో లత మనస్తాపం చెందినట్లు సమాచారం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు మాత్రం లత పర్సు మాయమైనట్లు వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని కొట్టి పారేశాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి