విజయ్ పై గవర్నర్ నిర్ణయం వెనుక, ఆయన సలహాతో మారిన సీన్..!!
తమిళనాడులో విజయ్ సీఎం అయ్యేది ఎప్పుడు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే గెలిచి నిలిచింది. దీంతో.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్తం అయ్యారు. ఈ మేరకు గవర్నర్ ను కలిసారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, పలు పార్టీలుకూడా తమతో చేతులు కలుపనున్నాయని గవర్నర్‌కు విజయ్ వివరించారు. అయితే, గవర్నర్ ముందుగానే పూర్తి మెజార్టీ పైన స్పష్టత ఇవ్వాలని నిర్దేశించారు. గవర్నర్ ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తు న్నారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.
విజయ్ కు ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిపితే 112 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది మద్దతు ఉండాలి. దీంతో.. గవర్నర్ తో విజయ్ తాను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటానని.. ఇందు కోసం 15 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. విజయ్ రెండు సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం అనివార్యం. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టయింది.

కాంగ్రెస్ బలం కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఏఐడీఎంకే 47 సీట్లలో గెలవగా, అందులోని ఒకవర్గం టీవీకే వైపు మొగ్గుచూపుతోంది. పీఎంకే-4, ఐయూఎంఎల్-2, సీపీఐ-2, సీపీఎం-2, డీఎండీకే, ఐఎంఎంకే చెరో సీటు కలిగి ఉన్నాయి. టీవీకేకు చిన్న పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు బలంగానే ఉన్నాయి. కాగా, గవర్నర్ మెజార్టీకి కావాల్సిన బలంతో రావాలని సూచించారు.
గవర్నర్ తో మరోసారి విజయ్ భేటీ
అయితే, అధికారికంగా మద్దతు ఇస్తేనే సంఖ్యాబలాన్ని విజయ్ చూపించుకునే అవకాశం ఉంటుంది. కాగా.. రాజ్యాంగ నిపుణులు, సలహాదారుల సూచన మేరకే తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన బలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి అవకాశమిస్తే... ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించినట్ల వుతుందని గవర్నర్‌కు సలహాదారులు స్పష్టం చేసినట్లు సమాచారం. పలు రాష్ట్రాల గవర్నర్లకు సలహాదారుగా ఉన్న వికాస్ బన్సోడేను తమిళనాడు గవర్నర్ అర్లేకర్ చెన్నైకి పిలిపించుకుని సలహా కోరినట్లు సమాచారం.
''స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం లేకపోతే ఎవరినీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకూడదు. విజయ్ వద్ద సంఖ్యాబలం లేదు. అందువల్ల ప్రభుత్వం ఏర్పా టు చేసేందుకు ఆయనను ఆహ్వానించాల్సిన అవసరం లేదు'' అని బన్సోడే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. గవర్నర్ సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాగా.. విజయ్ కాసేపట్లో మరోసారి గవర్నర్ ను కలవనున్నారు. తమిళనాడు పరిణామాలతో గవర్నర్ తన కేరళ పర్యటన వాయిదా వేసుకున్నారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
