హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ విప్ శైలజానాథ్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, విచక్షణారహితమైన విమర్శలు చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మంత్రుల ఛాంబర్ లకు టూలెట్ బోర్డులు పెడతామని తెలుగుదేశం నాయకులు మాట్లాడడం అర్థం లేనిదని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఫర్ సేల్ బోర్డులు తగిలించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజా సేవ చేయాలనే మంచి బుద్ధి కలగాలంటే వైయస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీల ఫొటోలకు తెలుగుదేశం నాయకులు ప్రణమిల్లాలని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కమిటీ సంప్రదింపులు పూర్తైన తర్వాత రాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభ్యులు శాసనసభను బహిష్కరించబోరని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి