ఆర్సీబీ మ్యాచ్ లో అదే టర్నింగ్ పాయింట్
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం రాత్రి రాయ్ పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మట్టికరిచింది. చివరి బంతి వరకు ఉత్కంఠతగా సాగిన ఈ పోరులో ముంబైని రెండు వికెట్ల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేలా చేసింది ఆర్సీబీ. బ్యాటర్లకు సవాలు విసిరిన పిచ్‌పై కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ మెరుపు బ్యాటింగ్ తో విజయాన్ని అందించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు ఏదీ అచ్చి రాలేదు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు త్వరగా ఔటవడంతో పవర్ ప్లేలోనే తడబడింది. తిలక్ వర్మ (42 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57), నమన్ ధిర్ (32 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 47) సమయోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరి కీలక భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

ముంబై ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్ కుమార్ (4/23) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను వరుస ఓవర్లలో అవుట్ చేసి టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత తిలక్ వర్మను కూడా పెవిలియన్ పంపించాడు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి కూడా ప్రారంభంలోనే షాకుల మీద షాకులు తగిలాయి. తొలి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ కూడా తక్కువ స్కోరుకే అవుటవ్వడంతో ఆర్సీబీ 24 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పవర్ ప్లే ముగిసే సమయానికి కెప్టెన్ రజత్ పాటిదార్‌ను సైతం కార్బిన్ బోష్ అవుట్ చేయడం ఆశలు అడుగంటాయి. ఆ దశలో ముంబై ఇండియన్స్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. జస్ ప్రీత్ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి పెంచగా, బోష్ అసాధారణ బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో పరుగులు తీయడం కష్టంగా మారింది. జాకబ్ బెథెల్ (27 బంతుల్లో రెండు ఫోర్లతో 27) కొంత వరకు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా, అసలు టర్నింగ్ పాయింట్ కృనాల్ పాండ్యా రాకతోనే మొదలైంది.
కృనాల్ మొదట ఒత్తిడిని తట్టుకుని నెమ్మదిగా ఎదురుదాడికి దిగాడు. విల్ జాక్స్, ఘజాన్‌ఫర్‌లపై దూకుడుగా స్వీప్ షాట్లు ఆడాడు. స్ట్రెయిట్ బౌండరీలు బాదాడు. ఘజాన్‌ఫర్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా అతను కొట్టిన భారీ సిక్స్ మ్యాచ్ కే హైలైట్. బెథెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆర్సీబీకి ఊపు వచ్చింది. వికెట్లు పడుతున్నా కృనాల్ పోరాటం ఆపలేదు. బోష్, ఘజాన్‌ఫర్‌లపై అతను విరుచుకుపడ్డాడు.
కార్బిన్ బోష్ బెథెల్ వికెట్ తీయడంతో మళ్లీ మ్యాచ్ ముంబై వైపు మొగ్గింది. అది మెయిడిన్ ఓవర్ కూడా. ఆ తర్వాత జితేష్ శర్మ, టిమ్ డేవిడ్‌లను వెంట వెంటనే అవుట్ చేసి ఆర్సీబీని మళ్ళీ ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి రెండు ఓవర్లల్లో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. 19వ ఓవర్ లో పెద్దగా పరుగులేమీ రాకపోవడంతో చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు అవసరం అయ్యాయి.
చివరి ఓవర్ లో హైడ్రామా చోటు చేసుకుంది. రాజ్ బావా వేసిన ఓవర్‌లో ఒక వైడ్, ఒక నోబాల్ రావడంతో ఆర్సీబీ ఆశలు చిగురించాయి. రొమారియో షెపర్డ్‌ను అవుట్ చేయడంతో ముంబై మళ్ళీ పట్టు సాధించింది. ఈ పరిస్థితుల్లో భువనేశ్వర్ కుమార్ క్రీజులోకి వచ్చాడు. బంతితో అద్భుతాలు చేసిన భువనేశ్వర్ బ్యాట్‌తో కూడా మ్యాచ్‌ను రక్తికట్టించాడు. ఒక వైడ్ బౌన్సర్‌ను ఎదుర్కొన్న తర్వాత, అతను డీప్ కవర్ మీదుగా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత సింగిల్ తీశాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరం అయ్యాయి.
రసిఖ్ దర్ చివరి బంతికి రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. తొలి పరుగును సులువుగానే పూర్తి చేసినా.. రెండో రన్ కోసం శ్రమించాల్సి వచ్చింది. డైవ్ చేసి మరీ రెండో పరుగు పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రనౌట్ ప్రమాదం సైతం తప్పింది. బోష్ అందించిన బంతితో వికెట్లను గిరాటేసే లోపే రసిఖ్ డైవ్ కొట్టి మరీ క్రీజ్ లోకి వచ్చాడు. బ్యాట్ క్రీజ్ లోపలే ఉండటంతో మ్యాచ్ ఆర్సీబీ పరం అయింది.












Click it and Unblock the Notifications