టీటీడీ గోశాలకు జ్యోతుల నెహ్రూ భారీ విరాళం
గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గోసంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఇందులో భాగస్వాములు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. గోవుల పరిరక్షణ, పాడి ఉత్పత్తుల పెంపు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఆదర్శమని అన్నారు. పురాణాలలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, గోసేవ సనాతన ధర్మమని ఆయన అభివర్ణించారు.
టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూకు చెందిన నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ ఛైర్మన్ టీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. ఈ ఎండుగడ్డిని 180 లారీల ద్వారా టీటీడీ గోశాలకు తరలించారు. ఈ లారీలను సీహెచ్ వెంకయ్య చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన స్వయంగా కొన్ని ఎండుగడ్డి మోపులను లారీల్లోకి ఎక్కించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతం నుండి ఈ గడ్డిని సేకరించాయి నెహ్రూ, శ్రీనివాస సేవా ట్రస్ట్.

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. మొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో విరాళం అందించడం అభినందనీయమని అన్నారు. గోవుల పరిరక్షణ, పాడి ఉత్పత్తుల పెంపు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి మేలు చేస్తాయని అన్నారు. పురాణాలలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, గోసేవ సనాతన ధర్మమని పేర్కొన్నారు. ఈ ఎండుగడ్డిని తిరుపతి, తిరుమల, పలమనేరు, భాకారాపేట కమలయ్యగారిపల్లి గోశాలలకు సరఫరా చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఆయా గోశాలల్లో మొత్తం 2,974 గోవులు, ఎద్దులు, లేగదూడలు ఉన్నాయని వెల్లడించారు. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. గత ఏడాది 38 లారీల ఎండుగడ్డిని అందించగా, ఈసారి 180 లారీల పరిమాణంలో విరాళం ఇచ్చినట్లు చెప్పారు. జగ్గంపేట రైతులు ఉచితంగా ఎండుగడ్డిని అందించడం గొప్ప విషయమని చెప్పారు. ఎస్వీ గోశాలకు జ్యోతుల నెహ్రూ రెండు గోవులు, దూడను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జానకీదేవి, జీ భానుప్రకాశ్ రెడ్డి, సదాశివరావు, శాంతారామ్, దర్శన్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications