ఇంటింటికీ టీడీపీ.. కొత్త కార్యక్రమానికి మంత్రి లోకేష్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా కార్యక్రమానికి సిద్ధమైంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర, జాతీయ కార్యవర్గ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం.. ప్రజల సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. వారానికి కనీసం నాలుగు రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, సమస్యలను నమోదు చేయడం, స్థానిక అవసరాలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలను నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యంగా కొత్త పెన్షన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేస్తున్నారని, గ్రామాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనుల కోసం ప్రజలు నిధులు కోరుతున్నారని వివరించారు. స్థానిక అవసరాల కోసం ప్రత్యేకంగా కొంత నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన నారా లోకేశ్.. ఇలాంటి సమస్యలు తన దృష్టిలో కూడా ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ప్రజల అవసరాలను, ఎమ్మెల్యేల సూచనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన పరిష్కారాలను అన్వేషిస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని లోకేశ్ స్పష్టం చేశారు. గ్రామాలు, వార్డులు, పట్టణాల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వెంటనే స్పందించేలా పార్టీ వ్యవస్థ పనిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
పార్టీ బలోపేతానికి కార్యాచరణ
అంతే కాకుండా రాబోయే రోజుల్లో టీడీపీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల స్థాయి నాయకత్వం మరింత చురుకుగా పనిచేయాలని, యువతను, మహిళలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని లోకేశ్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నివేదికలు సిద్ధం చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
45 రోజుల పాటు జరిగే ఈ 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు చేపట్టడమే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications