ఈ మూడు రాష్ట్రాలకు బీజేపీ ఇన్ ఛార్జీల నియామకం: ఆ ఆయువుపట్టుపై
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.. భారతీయ జనతా పార్టీ. గెలుపే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు చేసింది. ఇప్పటికే జాతీయ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళణ చేసింది. పలు కొత్త ముఖాలకు ఇందులో చోటు కల్పించింది. సీనియర్లకు కీలక బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రాల వారీగా సమీకరణాలను బేరీజు వేసుకుని పాత, కొత్త నేతల కలయికతో ఈ నూతన కార్యవర్గాన్ని పునర్నిర్మించుకుంది.
దీనికి కొనసాగింపుగా మరిన్ని నిర్ణయాలను తీసుకుంటోంది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాలకు నూతన ఇన్ ఛార్జీలను నియమించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ కు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విజయవకాశాలను మరింత మెరుగుపరుచుకోవడానికి వీలుగా రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు.

బీజేపీకి ఆయువుపట్టుగా భావించే ఉత్తర్ ప్రదేశ్ పై ప్రధానంగా దృష్టి సారించింది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రధాన ఇన్‌ఛార్జ్ పదవి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వినోద్ తావ్డేకు లభించింది. ఆయనకు తోడుగా జగదీష్ ఈశ్వర్‌భాయ్ పటేల్.. కో ఇన్‌ఛార్జ్ నియమితులు అయ్యారు. యూపీలో క్షేత్రస్థాయి సమీకరణాలను సమన్వయం చేయడంలో వినోద్ తావ్డే అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తోన్నారు.
వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్న పంజాబ్ లో రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా రాజ్యసభ సభ్యుడు సతీష్ పూనియా అపాయింట్ అయ్యారు. అదే సమయంలో.. బీజేపీకి తిరుగులేని కోటగా ఉంటూ వస్తోన్న గుజరాత్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్‌ను రంగంలోకి దించారు. గుజరాత్‌లో సుదీర్ఘకాలంగా ఉన్న పట్టును మరింత పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వాన్ని ఎంచుకుంది పార్టీ హైకమాండ్.
పార్టీ జాతీయ నూతన కమిటీలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు ఇవ్వగా, ఆర్‌ఎస్‌ఎస్ మాజీ నేత రామ్ మాధవ్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా మరోసారి జాతీయ ఉపాధ్యక్షురాలిగా తన స్థానాన్ని నిలుపుకొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు.













Click it and Unblock the Notifications