పాక్ ఉగ్ర ముఠా కుట్ర భగ్నం.. దేశ రాజధానిలో హై అలర్ట్ !!

దేశ రాజధానిలో భారీ ఉగ్రకుట్రను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఒక టెర్రర్-క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఛేదించి, దానికి సంబంధించిన ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ షహజాద్ భట్టి ఆదేశాల మేరకు ఈ ముఠా పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

పాకిస్థాన్ నుంచి ఆయుధాలు..

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. ఈ ముఠా పంజాబ్ సరిహద్దుల మీదుగా పాకిస్థాన్ నుంచి అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా భారత్‌లోకి తరలిస్తోంది. డ్రోన్ల సాయంతో పాకిస్థాన్ నుంచి పంజాబ్‌కు చేరిన ఆయుధాలను అక్కడి నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌కు చెందిన సభ్యులు ఆయుధాల స్మగ్లింగ్‌తో పాటు మాదక ద్రవ్యాల రవాణా, నేరగాళ్లకు లాజిస్టిక్ సపోర్ట్, స్థానిక నెట్‌వర్క్‌ల ఏర్పాటు వంటి కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.

delhi-police-special-cell-has-foiled-a-major-terror-plot-linked-with-pakisthan-in-the-national-capi

కాగా అరెస్టైన నిందితులు రాజధానిలోని రద్దీ ప్రదేశాలు, కీలక ప్రభుత్వ సంస్థలు, మత పెద్దల నివాసాలు, సున్నిత ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఆయా ప్రాంతాల ఫోటోలు, వీడియోలను సేకరించి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ద్వారా పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్లకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. భారత్‌లో ముఖ్యంగా ఢిల్లీలో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం ఈ ముఠా ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ అరెస్టులతో ఒక భారీ కుట్రను ముందుగానే అడ్డుకోగలిగామని అధికారులు పేర్కొన్నారు.

ఏడుగురు నిందితులు అరెస్ట్

ఈ కేసులో అనాస్ త్యాగి, మోహిత్ అలియాస్ యోగి, ఆరిఫ్ అలియాస్ ప్రధాన్, దీపక్ అగ్రోలా, ఆరిఫ్, కరణ్‌వీర్ సింగ్, జతన్, సబీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురికి ఇప్పటికే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు గతంలో స్మగ్లింగ్, ఆయుధాల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి ఐదు సెమీ-ఆటోమేటిక్ పిస్టళ్లు, 41 సజీవ తూటాలు, పాకిస్థాన్ హ్యాండ్లర్లతో జరిగిన సంభాషణలు, డిజిటల్ డేటా ఉన్న ఏడు మొబైల్ ఫోన్లు, ఒక స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలానే కొన్ని సిమ్ కార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం, అనుమానాస్పద కాంటాక్ట్ వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌కు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. గత మే నెలలో అందిన విశ్వసనీయ నిఘా సమాచారంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది. టెక్నికల్ సర్వైలెన్స్, కాల్ డేటా రికార్డులు, మొబైల్ లొకేషన్ విశ్లేషణ, డిజిటల్ కమ్యూనికేషన్ ట్రాకింగ్ ద్వారా ఈ నెట్‌వర్క్ కదలికలను అధికారులు నిశితంగా పరిశీలించారు. అనంతరం మంగళవారం పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొంత మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

దేశ భద్రతకు పెద్ద ముప్పు తప్పింది

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద, నేర ముఠాలు డ్రోన్లు, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి కొత్త పద్ధతులను వినియోగిస్తూ దేశ భద్రతకు సవాళ్లు విసురుతున్న సమయంలో ఢిల్లీలో ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడం కీలక విజయంగా భావిస్తున్నారు. ఈ ఆపరేషన్‌తో రాజధానిలో సంభవించే భారీ భద్రతా ముప్పును ముందుగానే అడ్డుకోగలిగామని, నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+