హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ వెంటనే రాజీనామాలు చేయాలనే తన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వాయిదా వేసుకుంది. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి)తో సంబంధం లేకుండా రాజీనామాలు చేయాలనే తెరాస నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తెరాస ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తప్పు పట్టారు. దాంతో జెఎసి సమావేశం జరిగే వరకు తమ నిర్ణయం అమలును వాయిదా వేయాలని తెరాస నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు వెల్లడైన వెంటనే తామంతా రాజీనామా చేస్తామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. శాసనసభ్యుల రాజీనామాకు శనివారం గడువు కూడా పెట్టారు. ఆ గడువు ప్రకారం శనివారం ఉదయం పదకొండున్నరకు రాజీనామాలు చేయాల్సి ఉంది.
తాము జెఎసి నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని అనుకుంటున్నామని, అటువంటి స్థితిలో కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. దాంతో కెసిఆర్ వెంటనే తమ పార్టీ నాయకులతో శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. జెఎసి నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని ఆ తర్వాత తెరాస ప్రకటించింది. తిరిగి శనివారం ఉదయం కెసిఆర్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యాడు. జెఎసి సమావేశం జరిగే వరకు రాజీనామాల విషయంలో వేచి చూడాలని తెరాస నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెరాస నిర్ణయం వల్ల మిగతా పార్టీలు కూడా జెఎసి నుంచి బయటకు వచ్చే వాతావరణం ఏర్పడింది. దీంతో తెరాస రాజీనామాల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి