హైదరాబాద్ : ఒకేరోజు రెండు భారీ విద్యుత్ కేంద్రాలకు పునాదిరాయి పడనుంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద 600 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి క్యాలరీస్ నిర్మించనున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రానికి ఆదివారం ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ వద్ద జెన్‌కో నిర్మించబోయే 700 మెగావాట్ల తొలిదశ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రానికి కూడా రోశయ్య అదేరోజు పునాదిరాయి వేయనున్నారు. ఇప్పటిదాకా బొగ్గు తవ్వకాలకే పరిమితమైన సింగరేణి క్యాలరీస్ సంస్థ విద్యుత్ ఉత్పాదక రంగంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. 600 మెగావాట్లలో 150 మెగావాట్ల విద్యుత్‌ను సింగరేణి సంస్థే వినియోగించుకుంటుంది. మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తుంది. ఈ కేంద్రం నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయం 2,700 కోట్ల రూపాయలు. ఇందులో ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు గానీ, పెట్టుబడులు గానీ ఏమీ లేవు. ఈ మొత్తాన్ని సింగరేణి సంస్థే సొంతంగా సమకూర్చుకోనుంది.
నేదునూర్ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం మొత్తం ఉత్పత్తి సామర్థ్యం మొత్తం 2,100 మెగావాట్లు. కాగా రెండోదశలో దీన్ని విస్తరిస్తారు. ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్‌జిల్లాల్లో నెలకొల్పబోయే ఈ రెండు విద్యుత్ కేంద్రాలను 2013 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వెనుకబడిన జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్‌లల్లో భారీ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను నెలకొల్పడం వల్ల పారిశ్రామికంగా అవి పుంజుకుంటాయని, వేలాదిమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి