కడప: లింగాల మండలం అక్కులుగారిపల్లె పంచాయతీలోని తేర్నాంపల్లె గ్రామంలో మార్చి 19వ తేదీన దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర సినిమా షూటింగ్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఎస్ ఎస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిర్మాతలు, డైరెక్టర్లు, కెమెరా మెన్ లు తేర్నాంపల్లె గ్రామంలోని ఎంపీపీ ఎన్ చంద్రశేఖర రెడ్డి ఇంట్లో ఆయనతో చర్చించారు. గ్రామంలో రాజకీయాలకు సంబంధం లేకుండా యాదవులకు చెందిన ఒక పాటను రికార్డు చేస్తామన్నారు. అదే విధంగా పురాతన కట్టడాలతో శోభాయమానంగా హస్తకళలతో అలలారుతున్న ఎంపీపీ ఇంటి ముందు కూడా షూటింగ్ జరుపుతామన్నారు.
ఈ సినిమాకు సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. వైయస్కు ప్రీతిపాత్రమైన పులివెందుల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనే సినిమా షూటింగ్ ఉంటుందన్నారు. వైయస్ డాక్టర్ వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు పూర్తి చరిత్ర ఇందులో ఇమిడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రమణబాబు, రామకృష్ణ, రంగారావు, కెమెరామన్ ఆనంద్ శ్రీరాం, మేనేజర్ చంద్రశేఖర్, లింగాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి