హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్నవారికే ఉపాధి లభిస్తోందని, వారు నెలకు రూ. 50 వేలదాకా సంపాదిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వలసలు పోతున్నారని తెలిపారు. ప్రస్తుత ఈ పరిస్థితికి పాలకులదే తప్పని వ్యాఖ్యానించారు. అలాగే అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైందని ఆయన విమర్శించారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక తాను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తెలిసినవాడిగా, ఆ ప్రాంత ప్రజల మనోభావాల దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నానని ఆయన తెలిపారు. ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఎక్కడుందని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండకూడదా? అని శుక్రవారం నాటి వ్యాఖ్యలను ఆయన తిరిగి ప్రస్దావించారు. పరిశ్రమలన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేశారని, అలాకాకుండా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉంటే అభివృద్ధి అంతటా జరిగేదని అభిప్రాయపడ్డారు. వెనుకబాటుతనంపై చర్చ జరగాలని కోరుతున్నానని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి