హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెసు మీద తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదందరామ్ చేసిన వ్యాఖ్యపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అనడంపై కోదండరామ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. దీనిపై దానం నాగేందర్ సోమవారం తీవ్రంగా స్పందించారు. తమకు కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హైకమాండ్ కాదని ఆయన అన్నారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసి హోలి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. శాసనసభ ఉప ఎన్నికల విషయంలో తమ పార్టీ అధిష్టానం మేరకు తాము నడుచుకుంటామని, ఎవరో చెప్పిన ప్రకారం తాము నడుచుకోలేమని ఆయన అన్నారు.