హైదరాబాద్ లో ఇ మెయిల్ హ్యాకర్ అరెస్టు

వెంకటసాయికృష్ణ 2002లో బీసీఏ పూర్తి చేశాడు. అనంతరం నగరంలోని ఓ కళాశాలలో ఎంఎస్సీ(ఐటీ)లో చేరి మధ్యలోనే మానేశాడు. 2004 నుంచి 2007 వరకు తాత్కాలిక పద్ధతిపై జీహెచ్‌ఎంసీ అర్బన్ ఫారెస్ట్రీలో పనిచేశాడు. తనకు సరిపడే ఉద్యోగం కాదంటూ దాన్నీ వదిలేశాడు. అప్పట్నుంచి ఖాళీగా ఉంటున్నాడు. అదేసమయంలో..తండ్రితో విభేదాలు తలెత్తాయి. ఏడాదిన్నర నుంచి ఈస్టు మారేడ్‌పల్లి మహేంద్రహిల్స్‌లో ఉంటున్నాడు. దీంతో సాయికృష్ణ దృష్టి హ్యాకింగ్‌వైపు మళ్లింది. www.110mb.com పేరుతో వెబ్ సైట్ రిజిస్టర్ చేయించాడు.
ఈ సైట్ ద్వారా యాహూలోని ఇతరులకు అందమైన అమ్మాయిల ఫొటోలను పంపించేవాడు. వీటిని చూడగానే నిందితుడు రూపొందించిన లాగిన్ పేజీ వస్తుంది. దీంట్లోకి లాగిన్ అయితే ఈ-మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ సహా అన్ని వివరాలు www.110mb.com లోకి వస్తాయి. ఈ విధంగా ఇప్పటివరకు సాయికృష్ణ 400 యాహూ ఈమెయిల్ ఐడీలను హ్యాకింగ్ చేశాడు. కొంతమంది పాస్ వర్డ్‌లను కూడా మార్చేశాడు. కొన్ని ఈ-మెయిల్ ఐడీల ద్వారా బెదిరింపు మెయిల్స్‌తోపాటు మహిళల సెల్‌ఫోన్లకు అసభ్య ఎస్ ఎంఎస్ లు పంపించాడు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో.. పూర్తి సమాచారం సేకరించి సాయికృష్ణను అరెస్టుచేశామని, అతనివద్ద ఆరు సిమ్ కార్డులు దొరికాయని సీఐడీ ఎస్పీ సుమతి శనివారం విలేకర్లకు తెలిపారు.
'మా అమ్మ చనిపోయిన దగ్గర్నుంచి ఆరోగ్యం దెబ్బతింది. బీసీఏ చదివాను. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం వలన ఉద్యోగం రావట్లేదు. ఒంటరిగా ఉండటంతో బోర్ కొట్టేది. అనుకోకుండా నాకు ఒకరి దగ్గర్నుంచి మెయిల్ వచ్చింది. అప్పట్నుంచి టైంపాస్ కోసం హ్యాకింగ్ చేయటం ప్రారంభించాను' అని సాయికృష్ణ చెప్పాడు.












Click it and Unblock the Notifications