వైయస్ ఓదార్పు యాత్రకు వెళ్లొద్దు: సోనియా మరోసారి ఆదేశం

ఓదార్పు యాత్ర తమ నియోజక వర్గాల్లో సాగనుండటంతో అందులో పాల్గొనాలా? వద్దా? అన్న సందేహంతో ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పనబాక లక్ష్మిలు మంగళవారం ఉదయం పార్లమెంటు హాల్లో సోనియాను కలిశారు. ఓదార్పు యాత్రలో పాల్గొనాలని స్థానిక నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నందున ఈ విషయమై తమకు మార్గదర్శనం చేయాలని కోరారు. వ్యక్తుల యాత్రల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని సోనియా నర్మగర్భంగా తన మనోభావాన్ని చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారు ఓదార్పు యాత్రకు జగన్ వర్గం చేస్తున్న అట్టహాసాల గురించి, అందులో పాల్గొనాలని నేతలకు ఫోన్లుచేసి బలవంత పెడుతున్న విషయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ప్రకాశం జిల్లాకు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ విషయంలో కలిసికట్టుగా ఉండాలని, అధిష్ఠానం వైఖరికి అనుగుణంగా నడచుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా శాసనసభ్యులు మహీధర్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, జి.వి.శేషు, ఉగ్రనరసింహారెడ్డిలు జేసీ దివాకర్‌రెడ్డిని సీఎల్‌పీ కార్యాలయంలో కలిశారు. మిగతా ఎమ్మెల్యేలతో బొత్స మాట్లాడారు. అనంతరం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మహీధర్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, జి.వి.శేషు, ఉగ్రనరసింహారెడ్డి, సురేష్ కుమార్, ఆమంచి కృష్ణమోహన్, విజయ్ కుమార్ ఢిల్లీకి బయల్దేరారు. గొట్టిపాటి రవికుమార్, ఉగ్రనరసింహారెడ్డిలను ఇదివరకే రాహుల్‌గాంధీ పిలిపించుకుని మాట్లాడారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తాను ఓదార్పు యాత్రలో పాల్గొనబోనని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొనరని ప్రకటించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి కూడా కేంద్రమంత్రిగా ఉన్నందువల్ల సోనియా మాటను గౌరవించడం ఆయనకు అనివార్యమని పార్టీ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications