వైయస్ జగన్ ను చంద్రబాబు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు?

చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులు జగన్ పై విమర్శలు చేయడం వెనక బలమైన రాజకీయ కారణం ఉందని భావిస్తున్నారు. జగన్ వ్యవహారాన్ని ఇప్పటి వరకు కాంగ్రెసు అంతర్గత వ్యవహారంగానే చూశారు. జగన్ ఓదార్పు రాజకీయాల వల్ల కాంగ్రెసు దెబ్బ తింటుందని చంద్రబాబు ఇప్పటి వరకు అంచనా వేస్తూ వచ్చారని చెబుతున్నారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం కూలిపోతుందని కూడా అంచనా వేసినట్లు సమాచారం. కాంగ్రెసు దెబ్బ తిని, రోశయ్య ప్రభుత్వం కూలిపోతే లాభపడేది తామేనని కూడా ఆయన నమ్ముతూ వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, పరిణామాలు తాను అంచనా వేసినట్లు లేకపోవడంతో జగన్ పై ఆయన గురి పెట్టినట్లు భావిస్తున్నారు.
వైయస్ జగన్ వల్ల కాంగ్రెసు కన్నా తమకే ఎక్కువ నష్టం జరుగుతుందనే అంచనా వేసుకున్నట్లు సమాచారం. జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి వెళ్లిపోక తప్పదని, దానివల్ల కాంగ్రెసు క్యాడర్ తో పాటు తమ పార్టీ క్యాడర్ కూడా జగన్ వైపు మళ్లే అవకాశం ఉంటుందని, దాని వల్ల నష్టం తమకు కూడా ఉంటుందని చంద్రబాబు విశ్లేషించుకున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం వల్ల జరిగిన నష్టం పునరావృతమవుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వైయస్ జగన్ పై, వైయస్ అవినీతి పాలనపై చంద్రబాబు విమర్శలకు పూనుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications