హైదరాబాద్: చచ్చిన గొర్రెలతో కలెక్టరేట్లను ముట్టడిస్తామంటూ టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. చనిపోతున్న గొర్రెలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించటంలేదని ఆయన ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే చచ్చిన గొర్రెలతో జిల్లాల్లోని కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ...గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ఉద్దేశించిన కార్పొరేషన్..బుగ్గ కారు, చైర్మన్ సీటుకే పరిమితమైందని దుయ్యబట్టారు. ఈ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయటంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నదని విమర్శించారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూస్తామని చెబుతున్న సర్కారే..వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నదని దుయ్యబట్టారు. నూలు, సిల్కు ధరలను గణనీయంగా పెంచి, కార్మికుల నడ్డి విరిచిందన్నారు. వాటి ధరలను వెంటనే తగ్గించి, సబ్సిడీపై సరుకు సరఫరా చేపట్టాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.