రవీంద్రనాథ్ రెడ్డిని మంత్రి రఘువీరా రెడ్డి కాపాడుతున్నారా?

ఈ వార్తాకథనం ప్రకారం - ఇప్పుడు ప్లాంట్ల అక్రమాలు బట్టబయలు కావడంతో తమకు వీటి విషయాలేమీ పెద్దగా ఇంతకాలం తెలియలేదని ఇప్పుడు వ్యవసాయశాఖ చెబుతోంది. ప్రధానంగా ముడిసరకుల కింద యూరియా, డిఏపీ, పొటాష్ వంటివి మిక్సింగ్ ప్లాంట్లకు ఇవ్వాలని ఎప్పటికప్పుడు కంపెనీలకు, మార్కెఫెడ్‌కు వ్యవసాయశాఖ ఆదేశాలు సైతం ఇస్తూ వచ్చింది. పైగా ఈ ప్లాంట్లలో నాసిరకం ఎరువులు తయారు చేసి అమ్ముతున్నట్లు ప్రయోగ శాలల్లో తేలినా చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.
వాటిపై తమకు నియంత్రణ లేదని వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి ఈ నెల 18న విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆయన ఆ మాటలు చెబుతున్నప్పుడు వ్యవసాయ కమిషనర్ సునీల్‌శర్మ కూడా పక్కనే కూర్చుని ఉన్నారు. ఉత్తర్వులు కమిషనర్ ఇచ్చినప్పుడల్లా కడప మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ప్లాంట్లకు భారీ పరిమాణంలో ఎరువులు కేటాయిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సహకార మార్కెటింగ్ సమాఖ్య(మార్క్‌ఫెడ్) నుంచి వాస్తవానికి సహకార సంఘాలకు ఎరువుల సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి. వ్యవసాయ కమిషనర్ ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తే ఎవరికైనా సమాఖ్య గోదాముల నుంచి పంపాలి. ఈ అధికారాన్ని ఆసరాగా చేసుకుని 2009 లోనే వరసగా మూడు సార్లు వ్యవసాయ కమిషనర్ మిక్సింగ్ ప్లాంట్లకు ఎరువులు పంపాలని సమాఖ్యకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ప్లాంటుకు ఏ రకం ఎరువు ఎంత పంపాలో కూడా కమిషనరే తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి ప్లాంట్లకు భారీ మొత్తంలో ఎరువులు కేటాయిస్తూ ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆ పత్రిక రాసింది. ఇతర ప్లాంట్లకు, రవీంద్రనాథ్ రెడ్డి ప్లాంట్లకు ఏయే మొత్తాల్లో ఎరువులు సరఫరా అయ్యాయో కూడా ఆ పత్రిక రాసింది. మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ప్లాంట్లకు తక్కువ ధరలకే ఎరువులు కేటాయించడానికి కూడా ప్రయత్నాలు జరిగినట్లు ఆ పత్రిక ఆరోపించింది. రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన ప్లాంట్లలో నాసిరకం ఎరువులు బయటపడ్డా కాపాడారని విమర్సించింది.












Click it and Unblock the Notifications