దేవేందర్ గౌడ్ ను అడ్డుకున్న టిఆర్ఎస్వీ: ఉద్రిక్తత,పలువురి అరెస్టు
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ గౌడ్ కు వికారాబాద్ లో పరాభవం ఎదురైన రెండుగంటలలోనే మరోసారి ఉప్పల్లోనూ అవమానం ఎదుర్కౌన్నారు. తెలంగాణ వాదులు వికారాబాద్ లో అడ్డుకోవటంతో అక్కడినుండి వెనుదిరిగి వచ్చిన ఆయన ఉప్పల్ లో సమావేశం కోసం వచ్చారు. ఆయితే ఆంతకుముందే తెలంగాణ విద్యార్థి ఐక్యా కార్యచరణ సమితి(ఐకాస) వికారాబాద్ లోనే కాదు, దేవేందర్ గౌడ్ ఉప్పల్ వచ్చినప్పటికీ ఇక్కడ కూడా ఆడ్డుకుంటామని హెచ్చరించారు. అయినప్పటీకీ ఆయన ఉప్పల్ లో సమావేశం కోసం వచ్చారు. కాని తెలంగాణ వాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆయనను మదీనగూడలోనే ఆడ్డుకుంది. దీంతో తెలుగు దేశం కార్యకర్తలు వారితో ఘర్షణకు దిగారు. తెలుగుదేశం, తెరాస విద్యార్థి విభాగం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు సైతం వారిని అదుపు చేయలేకపోయారు. ఇరువర్గాల మధ్య వాదన ముదిరి ఘర్షణకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి చేదాటుతుందని గమనించిన పోలీసులు తెరాస విద్యార్థులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. దీంతో తెలంగాణ వాదులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.