హైదరాబాద్: ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విశాఖ పర్యటన రద్దయింది. విశాఖపట్నంలోని పలు కార్యక్రమాల్లో నేడు ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన అస్వస్థతకు గురవ్వటంతో ఆయన వెళ్లడం లేదు. డాక్టర్లు ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దానికి తోడు హైదరాబాద్ లో రోడ్లు, పారిశుద్ధ్యంపై అత్యవసర సమావేశం కూడా ఉంది. ఇదీ కూడా ఆయన విశాఖ పర్యటన రద్దు కావడానికి ఒక కారణం. విశాఖలోని కింగ్ జార్జ వైద్యశాలలో ఓ ప్రెజెంటేషన్, గిరిజన సంక్షేమ భవన ప్రారంభం, మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భీమిలి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనాల్సి ఉంది. గత 5 రోజులుగా రోశయ్య పర్యటన కార్యక్రమాలు చురుగ్గా సాగాయి. కాని అర్థాంతరంగా ఆయన పర్యటన ఆగిపోవటంతో విశాఖ జిల్లాలో ప్రజలు ఆసంతృప్తికి గురయ్యారు. ఆయన వస్తే జిల్లాకు భారీగా నిధులు వస్తాయని భావించారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ మంత్రి బాలరాజు ఆధ్వర్యంలో యధావిధిగా జరుగుతాయి.