హైదరాబాద్: ఒకనాటి పార్టీ తెలుగుదేశం పార్టీ నెంబర్ 2 లీడర్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కు తన జిల్లాలోనే ఘోర చేదు అనుభవం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళుతున్న దేవేందర్ గౌడ్ ను అక్కడ తెలంగాణ విద్యార్థులు అడ్డుకున్నారు. తెలంగాణకోసం చిత్తశుద్ధితో పోరాడుతానని రెండు సంవత్సరాల క్రిందట తెలుగు దేశం నుండి బయటకు వచ్చి వివిధ పార్టీలు మార్చి మళ్లీ తెలుగు దేశంలోనే ఉండటాన్ని వారు ప్రశ్నించారు. తెలంగాణ పట్ల చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఇప్పుడు మళ్లీ ఆయనతో కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నరన్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడుతో శ్రీకృష్ణ కమిటీకి ఇప్పించాలని లేదంటే తెలుగు దేశం వారిని తెలంగాణలో తిరగనివ్వం అని హెచ్చరించారు. ఎంత నచ్చచెప్పినప్పటికీ తెలంగాణ విద్యార్థులు ఊరుకోక పోవటంతో ఆయన సమావేశానికి వెళ్లకుండా వెనుతిరిగారు.