మెదక్: మెదక్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు చెరువులో పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరో పదిమంది గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఓ బస్సు హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ కు వెళుతుండగా పెద్ద శంకరంపేట గ్రామానికి దగ్గరలోని తిరుమలాపురం చెరువులో పడి పోయింది. చెరువులో దాదాపు పూర్తిగా మునిగిపోయింది. ఉదయం పూట జరగటంతో ఆధికారులకు ఎవరికీ సమాచారం తెలియక ఎవరూ రాలేదు. చెరువుకు దగ్గరలోనే ఉన్న పెద్ద శంకరంపేట గ్రామస్తులు తమ తమ పొలాల దగ్గరకు వెళుతుండగా బస్సు టాప్ పైన నిలబడి అరుస్తున్నా వారిని చూసి రక్షణచర్యలు చేపట్టారు. ఎదురుగా రహదారిపైనుండి వస్తున్న ఒక వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. చెరువు చుట్టు బురదతో కూరుకు పోయి ఉండటంతో సహాయక చర్యలకుగాని, వారు బయటకు రావడానికి గాని తీవ్ర సమస్య ఏర్పడుతోంది. బస్సులో ఈత వచ్చిన వారు ఉన్నప్పటికీ చుట్టూ బురదగా ఉండటంతో వారు బయటికి రాలేని పరిస్థితి. మరో 20 మంది బస్సులోనే ఉన్నట్టు భావిస్తున్నారు. ఉదయం పూట కావటంతో బస్సులో ఎక్కువమంది కళాశాల విద్యార్థులు ఉన్నారు. అయితే పూర్తి సమాచారం వస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి.