ముదురుతున్న వైయస్ జగన్ ఇష్యూ: ఆజ్యం పోసిన సురేఖ

కాంగ్రెసు భూస్థాపిమతమైందని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గతంలో కన్నా ఎక్కువ ఘాటుగానే స్పందించారు. సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. దానిపై కొండా సురేఖ తీవ్రంగా మండిపడ్డారు. డిఎస్ ను ప్రశ్నించారు. సీనియర్ నాయకులపై ఫిర్యాదు చేయని డిఎస్ తనపై ఎలా ఫిర్యాదు చేస్తారని అడిగారు. సురేఖ తీరు సీనియర్ నాయకులను కూడా కదిలించింది. పాల్వాయి గోవర్దన్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి ఆమె మాటలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. సురేఖ పార్టీలో ఉన్నారా అని పాల్వాయి ప్రశ్నించారు. సస్పెండ్ చేస్తే సరిపోదని, సురేఖను పార్టీనుంచి బహిష్కరించాలని ఆయన అన్నారు.
మరోవైపు కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావుకు, జగన్ వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇద్దరు పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. డబ్బులు ఖర్చు పెడితే తనకు కూడా వైయస్ జగన్ సభలకు వచ్చే జనం కన్నా ఎక్కువ జనం వస్తారని విహెచ్ వ్యాఖ్యానించారు. దానిపై రాజమోహన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాము చందాలు వేసుకుని 30 కోట్ల రూపాయలు ఇస్తామని, విహెచ్ సభలు పెట్టాలని ఆయన సవాల్ చేశారు. ఆ సవాల్ ను విహెచ్ స్వీకరించారు.
రాష్ట్రంలోని కాంగ్రెసులో వాదవివాదాలు పతాక స్థాయికి చేరుకుంటున్న స్థితిలో అధిష్టానం చర్యలు తీసుకోవడానికి ముందుకు రావచ్చునని అనుకుంటున్నారు. సురేఖపైనే కాకుండా జగన్ వర్గానికి చెందిన ఇతర నాయకులపై కూడా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు డిఎస్ సమాయత్తమవుతున్నట్లు, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఎస్ ఫిర్యాదును ఆసరాగా చేసుకుని ఈ నెలాఖరులోగా అధిష్టానం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications