పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ఓ దుర్గా ఆలయంలో తొక్కిసలాట జరగటంతో 10 మంది మృత్యువాత పడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన బంకా జిల్లాలోని తిల్దిహా గ్రామంలో జరిగింది. ఈ గ్రామం రాజధాని పాట్నా నగరానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆదివారం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని బలివ్వడానికి సుమారు 30వేల మంది భక్తులు మేకలతో పాటు శనివారం రాత్రికే చేరుకున్నారు. అయితే ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. దీంతో దుర్గా ఆలయం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. గాయాలయిన భక్తులను దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. కాగా సీనియర్ పోలీసు అధికారులు పరిస్థితిని చక్కదిద్దడానికి ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు.