వైయస్ జగన్ ఇష్యూతో సహా సమస్యలన్నీ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాతే

డిసెంబర్ 31వ తేదీలోగా రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనుంది. అంత వరకు మంత్రి వర్గ విస్తరణ కూడా చేపట్టకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కె. రోశయ్యకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇదే విషయం చెప్పారని తెలుస్తోంది. అయితే, మంత్రివర్గ విస్తరణ ఉండదనే కచ్చితంగా చెప్తే పదవులు ఆశిస్తున్న శాసనసభ్యులు జారిపోయి వైయస్ జగన్ శిబిరంలో చేరుతారనే అంచనాతో ఆ విషయాన్ని వెల్లడించడం లేదని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ రేపో మాపో, ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఉంటుందంటూ ప్రచారం పెట్టడం ద్వారా శాసనసభ్యులను కట్టి పడేయాలనే ఎత్తుగడను మాత్రమే పార్టీ అధిష్టానం అనుసరిస్తోందని చెబుతున్నారు.
విజయవాడలో హైకోర్టు బెంచ్ కోసం డిమాండ్ చేస్తున్న న్యాయవాదులకు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పిన విషయం కూడా అందుకు అనుగుణంగానే ఉంది. ఈ డిమాండ్ పై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు ఆగాలని ఆయన న్యాయవాదులకు సూచించారు. తెలంగాణ అంశంపై తేల్చుకునేందుకే కోస్తాంధ్ర న్యాయవాదులు హైకోర్టు బెంచ్ సమస్యను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైకోర్టు కోసం మాట్లాడాల్సి ఉంటుంది. బెంచ్ ను అడగడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణవాదులు అంటున్నారు. ఏమైనా, రాష్ట్ర సమస్యలన్నింటికీ శ్రీకృష్ణ కమిటీయే పరిష్కారం చూపుతుందనే భావన కొంత మందిలో ఉంది.












Click it and Unblock the Notifications