హైదరాబాద్: ప్రభుత్వ రంగంకే పరిమితమైన రిజర్వేషన్లు ప్రైవేటు రంగంలోను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పూనియా బుధవారం అన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు ఉండటంతో ఎస్సీలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పునియా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు. ఈ రెండు రోజుల్లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో విద్య, అట్రాసిటీ కేసులు, గృహ నిర్మాణం తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాల అమలు తీరుపై ఎస్సీ కమిషన్ ఛైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ తీవ్రమైన అంశమని దానిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.