వాణిజ్యమే ఒబామా భారత పర్యటన ప్రధాన లక్ష్యం

Barrack Obama
న్యూఢిల్లీ: ప్రపంచంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్‌ ఒకటి. మా ఎగుమతులను అమ్ముకోవడానికి ఇక్కడ అవకాశం ఉందని గమనించాం. అమెరికాకు ఇది ఉద్యోగకల్పన వ్యూహం'' అని అనడాన్ని బట్టి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ఉద్దేశం ఏమిటో అర్థమవుతోంది. అస్తవ్యస్తంగా మారుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఆయన భారత్ ను వాడుకునేందుకు సిద్ధపడ్డారు. భారత్ ను అతి పెద్ద మార్కెట్ గా చూస్తున్నారు. భారత్ తో సన్నిహితంగా మెలగడం ద్వారా అమెరికా ప్రయోజనాలను కాపాడడానికి నడం బిగించారు. శనివారం ముంబైలో చేసుకున్న ఒప్పందాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన మాటలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.

మూడు రోజుల పర్యటనపై భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇరు దేశాల కంపెనీల మధ్య పది బిలియన్‌ డాలర్ల(రూ.44 వేల కోట్లు) విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరచారు. ఈ ఒప్పందాలతో అమెరికాలో కొత్తగా 50 వేల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. అయితే, ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌ అడ్డంకులను తొలగించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా కూడా తనవంతు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సహకారం 'వన్‌వే' లాగా ఉండకూడదని హితవు పలికారు. ఇరుదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉందని చెప్పారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, చిల్లర వ్యాపారం, టెలికం తదితర రంగాల్లో అడ్డంకులు తొలగిస్తే భారీఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు.

ఒబామా శనివారం ముంబయిలో భారత్‌, అమెరికా వాణిజ్య సంఘాల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాతో వాణిజ్యం చేసే దేశాల్లో 12వ స్థానంలో ఉన్న భారత్‌ అగ్రస్థానానికి ఎందుకు ఎదగకూడదని ప్రశ్నించారు. ఇరుదేశాల మధ్య సంబంధం 21వ శతాబ్దాన్నే నిర్వచించే గొప్ప భాగస్వామ్యంగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లో వాణిజ్య మంత్రి గ్యారీ లాకీ నేతృత్వంలో ఒక బృందం భారత్‌కు వస్తుందని, అమెరికా ఎగుమతుల నియంత్రణ విధానాన్ని సవరించుకోవడమే ఆ పర్యటన లక్ష్యమని చెప్పారు. ''నేను ఈ సదస్సుకు రావడానికి కొన్ని క్షణాల ముందుగా 20 చరిత్రాత్మక భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి. బోయింగ్‌ సంస్థ భారత్‌కు పలు విమానాలు అమ్ముతోంది. జనరల్‌ ఎలక్ట్రిక్‌ వందల సంఖ్యలో భారీ విద్యుత్‌ ఇంజిన్లను అమ్మనుంది. ఒప్పందాల విలువ పది బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. అమెరికాలో 50 వేలకు మించి ఉద్యోగాలు సృష్టించే వీలు కలుగుతుంది'' అని తెలిపారు. ఉన్న వ్యాపార అవకాశాల్లో కుదిరిన తాజా ఒప్పందాలు నామ మాత్రమేనని ఒబామా అన్నారు. భవిష్యత్తు మార్కెట్‌ భారతదేశమేనని చెప్పారు. పన్నురేట్లు, పెట్టుబడుల విషయంలో భారత్‌ అడ్డంకులను తొలగిస్తే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అమెరికా సిద్ధమని ప్రకటించారు. ఇరుదేశాల మధ్య వ్యాపారాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేసేందుకు అవకాశం ఉందని, అదేజరిగితే ఇరు దేశాలకూ లాభమేనని చెప్పారు. ఒబామా కుదుర్చుకున్న ఒప్పందాలు ఈ విధంగా ఉన్నాయి.

వాణిజ్య సంఘాల సమావేశానికి ముందు ఒబామా, వాణిజ్య మంత్రి గ్యారీ లాకీలు భారతీయ-అమెరికన్‌ కంపెనీల సీఈవోల సంప్రదింపుల సమావేశానికి వచ్చారు. ఫార్మా, వస్తూత్పత్తి, రవాణా, కాలుష్య రహిత ఇంధన రంగాల్లో సంప్రదింపులు జరిగాయి. విద్యుత్‌ కారు, సౌర విద్యుత్‌, తాగునీరు, ఫార్మారంగంలో ఇటీవలి ఆవిష్కరణలు ప్రస్తావనకు వచ్చాయి. మహీంద్ర సంస్థ ఎండీ ఆనంద్‌ మహీంద్ర, పిరమల్‌ ఫార్మా సంస్థకు చెందిన అజయ్‌ పిరమల్‌, తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఉపాధి అవకాశాల కల్పనకు విశేష కృషి చేస్తున్న 15 మంది యువ పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌కు చెందిన మహీంద్ర రేవా, అమెరికాకు చెందిన కర్టిస్‌ భాగస్వామ్య ఒప్పందాల కోసం పరస్పరం ఆసక్తి చూపాయి. పిరమల్‌ సంస్థ 'సర్వజల్‌' అనే మంచినీటి శుద్ధి యూనిట్‌ల తయారీలో మిన్నెసొటాకుచెందిన పెంటైర్‌ ఫిల్టరేషన్‌ సిస్టమ్‌ సహకారాన్ని తీసుకొనేందుకు సంసిద్థత వ్యక్తం చేసింది.

* ఒబామా రిలయన్స్‌ పవర్‌, స్పైస్‌ జెట్‌లకు సంబంధించిన రెండు భారీ ఒప్పందాలపై జరిగిన సంతకాలకు హాజరయ్యారు.
* భారత్‌కు చెందిన రిలయన్స్‌ పవర్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట వద్ద నిర్మించే 2400 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి అమెరికాలోని జనరల్‌ ఎలక్ట్రిక్‌ సంస్థ టర్బైన్లను సరఫరా చేయనుంది. ఇందుకు సంబంధించి రూ.8800 కోట్ల విలువచేసే ఒప్పందంపై ఇరుసంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కోసం స్వయంగా జీఈ సీఈవో జెఫ్రీ ఇమ్మెల్ట్‌ భారత్‌కు వచ్చారు. మూడోవంతు ప్రపంచ దేశాలకు విద్యుత్‌ టర్బైన్‌లను జీఈ సంస్థే సరఫరా చేస్తోంది.
* భారత్‌కు చెందిన చౌక పౌర విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ నుంచి ముప్ఫై 737 తరహా విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఒప్పందం విలువ 11,880 కోట్ల రూపాయలు.
* భారత్‌ స్వయంగా తయారు చేసుకొనే మిలిటరీ విమానాలకు జీఈ సంస్థ ఇంజిన్లను సమకూర్చే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
* బోయింగ్‌ సంస్థ భారత వైమానిక దళానికి సీ17 తరహా విమానాలు పదింటిని సరఫరా చేసే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
* అమెరికా ఎగుమతుల నిబంధనలను త్వరలో సడలిస్తామని ఒబామా ప్రకటించారు. దాంతో భారత్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో)లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరాకరించే వివక్షకు తెర పడుతుంది.
* శాంతియుత, యుద్ధ అవసరాలకు రెండు రకాలుగా ఉపయోగపడే అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత కంపెనీలకు ఇవ్వడానికి అమెరికా నిరాకరిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు సృష్టించే కోణంలో దీనికీ చెల్లుచీటీ పాడతామని ఒబామా సంకేతాలు ఇచ్చారు.
* 2009-10లో ద్వైపాక్షిక వాణిజ్యం 3650 కోట్ల డాలర్లు(1.6 లక్షల కోట్ల రూపాయలు). ఐదేళ్లలో దీన్ని రెట్టింపు చేయాలన్నది ఒబామా లక్ష్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+