కావూరి వర్సెస్ కేశవరావు: ప్రాంతాలవారీగా కాంగ్రెసు ఎంపిల చీలిక

Congress
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై సయోధ్య కోసం ఏర్పాటైన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో గొడవ చోటు చేసుకుంది. పార్లమెంటు సభ్యులు ప్రాంతాలవారీగా చీలిపోయి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పోలవరంపై సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన రెడ్డి నివాసంలో సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ భేటీలో సీమాంధ్ర తరఫున నేదురుమల్లి జనార్దనరెడ్డి, కావూరి సాంబశివరావు, జె.డి.శీలం, ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ నుంచి కె.కేశవరావు (కేకే) వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ పాల్గొన్నారు. 8 మంది ఎంపీలు మాత్రమే హాజరైన ఈ సమావేశంలో చర్చల సందర్భంగా కావూరి, కేకే మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగి అది సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల మధ్య తగవుగా మారింది.

కేకేతో పాటు సమావేశానికి హాజరైన తెలంగాణ ఎంపీలు వాకౌట్ చేశారు. పోలవరంపై చర్చ సందర్భంగా గిరిజనులను గోచిపాతగాళ్లని, తాటాకులు కట్టుకుంటారని కావూరి అన్నారని, దీనిపై తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశానని కేకే అన్నారు. కావూరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నట్లు తెలంగాణ ఎంపీలు వాకౌట్ తరువాత ప్రకటించారు. కాగా, ఈ ఆరోపణలను కావూరి ఖండించారు. తాను కొల్లేరు సందర్భాన్ని వివరిస్తూ గిరిజనుల స్థితిగతులు ఎలా మెరుగయ్యాయో చెప్పానని, ఎవర్నీ కించపరచ లేదని తెలిపారు.

సమావేశంలో వాగ్వివాదం ఏదీ జరగలేదని, ప్రణబ్‌తో అపాయింట్‌మెంట్ ఉండి ఎంపీలు వెళ్లిపోయారని శీలం చెప్పారు. వాకౌట్ తర్వాత వీహెచ్ నివాసంలో ఆయనతో పాటు కేకే, పొన్నం, వివేక్‌లు విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ గిరిజనులకు ఎంతో విలువిచ్చి, వారి ప్రాంతాల్లో పర్యటించారన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలే గిరిజనులను అవమానిస్తున్నారని కావూరిని విహెచ్ ఉద్దేశించి విమర్శించారు. పోలవరాన్ని తాము వ్యతిరేకించడం లేదని, ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల ద్వారా ముంపును నివారించవచ్చునని తాము చెబుతున్నామన్నారు. కేకే మాట్లాడుతూ.. గిరిజనులపై అగ్రవర్ణాల వారి దురహంకారాన్ని తాము సహించబోమన్నారు. గిరిజన ఎంపీలు బలరాం నాయక్, రత్నాబాయి కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారని కేకే చెప్పారు.

"శీలం దళితుడైనప్పటికీ.. గిరిజనులను అవమానిస్తే కప్పిపుచ్చే యత్నం చేయడం దారుణం. పోలవరంపై సానుకూల దృక్పథంతో మాట్లాడేందుకు సమావేశానికి వెళ్లాం. గిరిజనులను అవమానిస్తుంటే సహించలేకపోయాం. అది గిరిజనుల భూమి వారి (కావూరి) బాబుసొమ్ము కాదు. సోనియా శంకుస్థాపన చేసిన పోలవరాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని ప్రచారం చేస్తుంటే ఈ సమావేశానికి వెళ్లాం. పోలవరాన్ని తెలంగాణ ఎంపీలు మాత్రమే కాదు సీమాంధ్ర ఎంపీలు హర్షకుమార్, రత్నాబాయి కూడా వ్యతిరేకిస్తున్నారు" అని చెప్పారు. పోలవరాన్ని వ్యతిరేకించడం లేదని మృతదేహాలపై ప్రాజెక్టు కట్టవద్దని మాత్రమే అంటున్నామన్నారు. కేకే, వీహెచ్‌ల వ్యాఖ్యలతో పొన్నం, వివేక్‌లు కూడా ఏకీభవించారు.

పోలవరం ముంపు బాధితులైన గిరిజనులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించ లేదని పర్యావరణ మంత్రి జై రాం రమేశ్‌ను కలిసి ఎంపీ రత్నాబాయి ఫిర్యాదు చేశారు. ఆమె వెంట కేకే కూడా వెళ్లారు. అయితే ఈ విషయం గిరిజన మంత్రిత్వ శాఖ పరిధిలోనిదని జై రాం రమేశ్ వారికి స్పష్టంచేశారు. కాగా, పోలవరం వల్ల తన నియోజకవర్గంలో ముంపు ఏర్పడే ప్రమాదం ఉందని, ఎన్ని కట్టడాలు కట్టినా నీటి ప్రవాహాన్ని ఆపడం సాధ్యపడదని ఇటీవల జరిగిన పరిణామాలు రుజువు చేశాయని అమలాపురం ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ విషయంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+